Share News

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ.. చెరువు ఎఫ్‌టీఎల్‌లో లేదు!

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:03 AM

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా..

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ..  చెరువు ఎఫ్‌టీఎల్‌లో లేదు!

  • హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. రెవెన్యూ, నీటిపారుదల శాఖ సర్వే రిపోర్టును సమర్పించిన ఏఏజీ

  • పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం

  • సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు మ్యాపుల్లో స్పష్టమవుతోంది కదా?

  • ఎఫ్‌టీఎల్‌ తుది నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు?

  • గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్‌ ఇప్పుడు ఎలా తగ్గింది?

  • ఈ చెరువు విషయంలో హైడ్రా ఏం చేసింది?

  • నచ్చినవారిని వదిలేస్తారా? అని ప్రశ్న

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ హైకోర్టుకు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్‌ కాకతీయ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని.. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు లేవని చెప్పారు. ఒవైసీ విద్యాసంస్థను సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ ఆక్రమించి కట్టారని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా నిర్వహించి రూపొందించిన నివేదికను ఏఏజీ హైకోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టును, సంబంధించిన మ్యాపులను పరిశీలించిన ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్‌టీఎల్‌ ఆక్రమణకు గురి కాలేదని ఎలా చెబుతారు? గత కాస్ర పహాణీల్లో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డయి ఉంది. 2016లో సల్కం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. అప్పుడు ఉన్న ఎఫ్‌టీఎల్‌ ఇప్పుడు ఎలా తగ్గింది? పదేళ్లుగా ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు?’ అంటూ నిలదీసింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు నచ్చినవారి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల మరో విధంగా (పిక్‌ అండ్‌ చూస్‌ పద్ధతిన) వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఆక్షేపించింది. చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతున్న హైడ్రా.. ఈ చెరువు విషయంలో ఏం చేసిందని ప్రశ్నించింది. మునిసిపల్‌శాఖ, నీటిపారుదలశాఖ, హెచ్‌ఎండీఏ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


అక్రమ నిర్మాణాలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ, సలార్‌-ఏ-మిల్లత్‌ ట్రస్టు తరఫున సీనియర్‌ న్యాయవాదులు జే రామచంద్రరావు, పీ వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, తమ సంస్థపై ఆరోపణలు చేయడానికి పిటిషనర్‌ ఎవరని ప్రశ్నించారు. ఎప్పుడో నిర్మాణాలు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు పిటిషనర్‌ ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని టీఎస్‌-బీపాస్‌ చట్టంలో ఉందని, భవిష్యత్‌ తరాలకు, జలవనరులకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ‘బుల్డోజర్‌ జడ్జిమెంట్‌’ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటూ గతంలోనే నోటీసులు జారీ అయ్యాయని, ఆ తీర్పును ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కాగా, ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ కేజీ టు పీజీ విద్యాసంస్థకు అనుమతి విషయంలో హైకోర్టుకు పాఠశాల విద్యాశాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ఆ సంస్థ గత ఏడాది డిసెంబరులో పాఠశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుందని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.


లాయర్‌ రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

సల్కం చెరువు వివాదంపై పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సోషల్‌ మీడియాలో కొందరు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాది విజయ్‌గోపాల్‌ తెలిపారు. కోర్టు విచారణపై సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం జరుగుతోందని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనంపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్టేటస్‌ కో కొనసాగించాలని ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం వెనక్కి తీసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చాలని చూస్తున్నారంటూ ఫాతిమా ఒవైసీ ట్రస్టు, సలార్‌ ఏ మిల్లట్‌ పిటిషనర్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై మరో ధర్మాసనం వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. స్టేటస్‌ కో ఉత్తర్వులను జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి వెనక్కి తీసుకున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 06:04 AM