యజమానికి తెలియకుండానే బ్యాంకుల్లో విల్లాల మార్టిగేజ్
ABN , Publish Date - May 19 , 2026 | 04:53 AM
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మోసాలు ఆగడం లేదు. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గౌడవెల్లిలోని ప్రముఖ...
సాకేత్ భూ-సత్వ ప్రాజెక్టులో రూ.30 కోట్ల భారీ మోసం!
విల్లాలను అక్రమంగా మార్టిగేజ్ చేసి రుణం తీసుకున్న డెవలపర్లు
సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదు
హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మోసాలు ఆగడం లేదు. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గౌడవెల్లిలోని ప్రముఖ ‘సాకేత్ భూ సత్వ’ విల్లా ప్రాజెక్టులో రూ.30 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది. ఇప్పటికే యజమానులకు అప్పగించిన విల్లాలను డెవలపర్లు తమ ‘అన్‌సోల్డ్ ఇన్వెంటరీ’(అమ్ముడుపోని ఆస్తులు)గా చూపించి బ్యాంకుల వద్ద అక్రమంగా మార్టిగేజ్ చేసి రుణాలు పొందారు. దీనిపై బాధితులు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. గౌడవెల్లికి చెందిన వ్యాపారవేత్త ఎ.రోహిత్ రెడ్డి కుటుంబానికి 13.8 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు 2009లో ‘సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో అగ్రిమెంట్ కుదిరింది. ‘సాకేత్ భూ-సత్వ’ పేరిట చేపట్టిన ఈ విల్లా ప్రాజెక్టులో భూ యజమానులకు 36 శాతం, డెవలపర్‌కు 64 శాతం వాటాగా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రోహిత్ రెడ్డి కుటుంబానికి కేటాయించిన విల్లా నంబర్-94 నిర్మాణం 2021లో పూర్తయింది. అప్పటి నుంచి వారు అక్కడే నివసిస్తున్నారు. తర్వాత తండ్రి నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ విల్లా రోహిత్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈనెల 2న రోహిత్ రెడ్డి ఆన్‌లైన్‌లో ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ పరిశీలించగా షాకింగ్ విషయం వెలుగుచూసింది. తమ విల్లాను సాకేత్ ఇంజనీర్స్ సంస్థ డైరెక్టర్లు రవి కుమార్ గొల్లపూడి, రాధాకృష్ణ తిమ్మరాజు, ప్రియా తిమ్మరాజులు వారి ఆస్తిగా చూపించి 2025 అక్టోబర్ 16న ‘విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా లిమిటెడ్’ వద్ద అక్రమంగా మార్టిగేజ్ చేసినట్లు గుర్తించారు. ఇదొక్క విల్లానే కాకుండా, మరో ఐదు విల్లాలు, పలువురు వృద్ధులకు విక్రయించిన సుమారు 20 ఫ్లాట్లు సహా మొత్తం 36 అపార్టుమెంట్‌లను కుదువ పెట్టారు. వీటన్నిటినీ అక్రమంగా మార్టిగేజ్ చేసి సుమారు రూ.30 కోట్ల మేర రుణం పొందారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కైరమ్ నం.49/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.