Share News

ఆ ఏడు కేసులేవో తెలియజేయండి

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:19 AM

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌, సిట్‌ చీఫ్‌ వీసీ సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు...

ఆ ఏడు కేసులేవో తెలియజేయండి

  • సిట్‌ ప్రతిష్ఠ, విశ్వసనీయతను దెబ్బతీసేందుకు.. దర్యాప్తును ప్రభావితం చేసేందుకే ఆరోపణలు

  • ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు సజ్జనార్‌ నోటీసులు

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌, సిట్‌ చీఫ్‌ వీసీ సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆరోపించినట్లు తనపై ఉన్న ఏడు కేసులేవో తెలపకపోతే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈమేరకు శుక్రవారం ప్రవీణ్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సిట్‌ చీఫ్‌పై ఏడు క్రిమినల్‌ కేసులు నమోదయినట్లు ఆరోపించారని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సిట్‌ చీఫ్‌పై విచారణకు మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినట్లు సజ్జనార్‌ తన నోటీసులో స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆధారాలు లేనివి, బాధ్యతారహితమైనవి, పరువు నష్టం కలిగించేవని నోటీసుల్లో పేర్కొన్నారు. అవి సిట్‌ ప్రతిష్ఠను, విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, ప్రస్తుత దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తనపై మోపిన ఆరోపణలకు సంబంధించి ఆ ఏడు కేసులు ఏ నేరంలో, ఏ స్టేషన్‌లో, ఏయే సెక్షన్ల కింద నమోదయ్యాయో, ఒకవేళ నమోదయితే వాటి పూర్తి వివరాలు రెండు రోజుల్లో తప్పనిసరిగా తెలియజేయాలని స్పష్టం చేశారు. లేకపోతే పరువు నష్టం, ‘క్రిమినల్‌ ఇంటిమిడేషన్‌’ సహా తగిన సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనివల్ల కలిగే న్యాయపరమైన పరిణామాలకు ప్రవీణ్‌కుమారే పూర్తిగా బాధ్యత వహించాలని సజ్జనార్‌ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 05:19 AM