బండి భగీరథ్‌కు నోటీసులు
ABN , Publish Date - May 13 , 2026 | 03:53 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. భగీరథ్ బుధవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో....
నేడు పోలీసు విచారణకు తీసుకురావాలని భగీరథ్ మేనమామకు నోటీసుల అందజేత
పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరం
సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు పోలీసుల సన్నద్ధం
కేసులో నమోదైన సెక్షన్లకు అదనంగా పోక్సో సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6 చేర్పు
దోషిగా తేలితే 20 ఏళ్ల వరకు శిక్ష
బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన డీసీపీ రితిరాజ్
భగీరథ్ మిత్రులనూ విచారించనున్న పోలీసులు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/పేట్ బషీరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. భగీరథ్ బుధవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్‌లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు అంటించారు. అనంతరం కరీంనగర్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న భగీరథ్ మేనమామ వంశీకృష్ణ ఇంటికి వెళ్లి నోటీసులు ఆయనకు అందజేశారు. భగీరథ్‌ను వెంటబెట్టుకొని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు డిజిటల్, భౌతిక సాక్ష్యాధారాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ఈ కేసు విచారణ పర్యవేక్షణ అధికారి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ మంగళవారం మరోసారి బాధితురాలితో మాట్లాడారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని భరోసా కేంద్రంలో ఆమెను స్వయంగా విచారించి మరోసారి వాంగ్మూలం రికార్డు చేశారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి తొలుత నమోదైన సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్, బీఎన్‌ఎస్ 74, 75లకు అదనంగా పోక్సో సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6ను అదనంగా చేర్చారు. ఈ సెక్షన్ల ప్రకారం.. ముద్దాయి దోషిగా తేలితే సుమారు 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయి.
భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాల నమోదు..
గత ఏడాది డిసెంబరు 31వ తేదీ రాత్రి మొయినాబాద్‌లోని అనన్య ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి హాజరైన భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. భగీరథ్‌తోపాటు ఈ పార్టీలో పాల్గొన్న గౌరవ్, విశాల్, స్నేహ, శ్రియల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆ రోజు పార్టీలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడంతోపాటు ఆరోపణల్ని ధ్రువీకరించుకునేందుకు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేపట్టడానికి సన్నద్ధమయ్యారు. తన కుమార్తెతో బలవంతంగా బ్రీజర్ తాగించార ని, అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల వరకు భగీరథ్ లైంగిక దాడికి ప్రయత్నించాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొనడంతో.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అనన్య ఫాంహౌస్‌ను ఎవరు బుక్ చేసుకున్నారు? అక్కడి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? ఎవరెవరు వచ్చారు? అన్న విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు గత ఏడాది అక్టోబరు 25న తన కుమార్తెను భగీరథ్.. గోల్ఫ్ వ్యూ సర్వీస్ అపార్టుమెంటుకు పిలిపించి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో వారితోపాటు ఉన్న భగీరథ్ మిత్రులు మోక్ష, కార్తికేయలను సైతం పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యాయత్నంపై వైద్యులను సంప్రదించారా?
తన కుమార్తె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లి పేర్కొన్నందున.. ఎవరైనా వైద్యులను సంప్రదించారా? అనే విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. అలాగే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి రాజీ చేసుకొమ్మని అడిగారని, నిర్మల్ కేసు గురించి భయపెట్టారని, తర్వాత బండి సంజయ్‌ను కలిపించారని ఫిర్యాదులో పేర్కొనడంతో.. వారిని కూడా విచారించే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా కేసు నమోదైన తర్వాత భగీరథ్ తన ఫోన్లను స్విచాఫ్ చేసుకోవడంతో అతడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, పలు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెబుతున్నారు. అయితే హైకోర్టులో తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తర్వాత భగీరథ్ లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.