రైతు భరోసాకు నిధుల సమీకరణ
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:38 AM
రైతు భరోసా రెండో విడత కోసం ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దఫా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రెండో విడత కోసం వారు ఎదురుచూస్తున్నారు..
22లోపు యాసంగి రెండో దఫా సొమ్ము
5 ఎకరాల వరకు వర్తింపజేసే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా రెండో విడత కోసం ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దఫా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రెండో విడత కోసం వారు ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటలు చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ నెలలోనే పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది. యాసంగి సీజన్ రైతు భరోసా నిధులను మూడు దఫాలుగా జమ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. మొదటి దఫా నిధులను గత నెల 23న రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 68,89,955 మంది రైతులకు ఒక ఎకరంలోపు వరకు సొమ్మును వేసింది. 57,44,907.19 ఎకరాలకు మొత్తం రూ.3,446.94 కోట్లు జమ చేసింది. రెండో దశ నిధులను ఈ నెల 22లోపు, మూడో దఫా నిధులను ఈ నెలాఖరుకల్లా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిధులు సమీకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ, ఎక్సైజ్ సుంకాలు, అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెలా ఆదాయం సమకూరుతుంటుంది. వీటిలో ఎక్కువ శాతం నిధులు ఉద్యోగుల వేతనాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలకే ఖర్చవుతుంటాయి. మిగిలిన నిధులను ఖజానాలో ఉంచి అత్యవసరాలకు వినియోగించుకోవడం పరిపాటి. ఇవి కాకుండా ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంటుంది. వీటి నుంచి కూడా అత్యవసర స్కీములకు నిధులు సర్దుబాటు చేయడం సాధారణమే. అందులో భాగంగానే మార్కెట్ నుంచి రుణాలను పెద్దమొత్తంలో సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న ఒకేసారి రూ.3,900 కోట్లు రుణం తీసుకుంది. ఈ నెల 21న మరో రూ.3,000 కోట్లు అప్పు తీసుకోనుంది. ఇలా మొత్తం రూ.6,900 కోట్లు ఖజానాలో ఉంటాయని తెలుస్తోంది. వాటి నుంచి రెండో దఫా రైతు భరోసాకు కొంతమేర నిధులు బదలాయించే అవకాశాలున్నట్లు తెలిసింది. రెండో దఫా కింద ఐదెకరాల వరకు సొమ్ము జమ చేయవచ్చని సమాచారం. ఇందుకు రూ.3,000 నుంచి రూ.4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. మూడో దఫాను నెలాఖరు లోగా జమ చేసే అవకాశాలున్నాయి. వాస్తవానికి రైతు భరోసా స్కీమ్‌ను ఒక సీజన్‌లో అమలు చేయడానికి రూ.9 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయి.