Share News

‘రైతు భరోసా’లో కొత్త రైతులు!

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:51 AM

రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు..

‘రైతు భరోసా’లో కొత్త రైతులు!

  • ఈ నెల 15 నాటికి పాస్‌పుస్తకం వచ్చినవారికే

  • జూలై 5 వరకు లబ్ధిదారుల నమోదుకు అవకాశం

  • పథకం కోసం నిధులు సమీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  • బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.7 వేల కోట్ల రుణం

  • ఈ నెల 30న రైతుల ఖాతాలకు నగదు బదిలీ

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు.. సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి, తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీలు ప్రకటించింది. ఈ నెల (జూన్‌) 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు.. రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)కి గానీ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)కి గానీ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్సు కాపీలతోపాటు రైతుభరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రకటించింది. కాగా వ్యవసాయశాఖ అధికారులు సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకొని.. రైతుభరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతులు చేరిపోతారు. రైతుభరోసా పథకానికి ప్రభుత్వం నిధులు సమీకరిస్తోంది. 30న రైతుల ఖాతాల్లో రైతుభరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో నిర్వహించే బహిరంగసభలో ఈ నిధులను సీఎం విడుదల చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి ఒకేసారి 7 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆర్బీఐకి ఇండెంట్‌ పెట్టింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 18 ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 23 ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 29 ఏళ్ల కాల పరిమితితో రూ.2 వేల కోట్ల చొప్పున ప్రభుత్వం రుణంతీసుకోనుంది. ఈ నిధులు ఈ నెల 30న ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. వీటిని రైతుభరోసా పథకానికి ప్రభుత్వం వినియోగించనుంది.


గత ఖరీఫ్‌ మాదిరిగానే...

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. నిరుడు ఖరీఫ్‌ సీజన్‌లో వీరికి ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మొదటి రోజు ఒక ఎకరం వరకు భూ విస్తీర్ణం ఉన్న పట్టాదారులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించాలంటే రూ.900 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఒకవేళ రెండెకరాల వరకు నగదు బదిలీ చేస్తే రూ.2,400 కోట్లు అవసరం పడతాయి. రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ.. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఒకేసారి నగదు బదిలీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 30న ప్రారంభిస్తే.. మధ్యలో జూలై 5న ఆదివారం వస్తోంది. ఆ రోజు మినహాయిస్తే.. 8 రోజుల్లోనే నగదు బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని వ్యవసాయశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో మొత్తంగా కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించాలంటే రూ. 9 వేల కోట్లు అవసరమవుతాయి. రెండు పంటలకు కలిపి రూ.18 వేల కోట్లు అవుతాయి. అందుకే గత బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లను రైతుభరోసాకు ప్రభుత్వం కేటాయించింది. గడిచిన యాసంగి సీజన్‌లో రెండెకరాల వరకు మాత్రమే ప్రభుత్వం రైతుభరోసా చెల్లించింది. ఈ ఖరీ్‌ఫలో మాత్రం పూర్తిస్థాయిలో చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అప్పు తీసుకునే రూ.7 వేల కోట్లకు మరో రూ.2 వేల కోట్లు జోడించనుంది.

Updated Date - Jun 27 , 2026 | 05:53 AM