17న రైతు భరోసా
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:32 AM
రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది.
యాసంగి పెట్టుబడిసాయం అందించనున్న ప్రభుత్వం
1.46 కోట్ల ఎకరాలకు అందించేలా ప్రణాళిక
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. ఈ నెల 17న రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మునిసిపల్ ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లను ఖర్చు చేయనుంది. ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.