Share News

రైతుబంధు, పింఛను డబ్బులు ఇవ్వబోం!

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:18 AM

గత ఎన్నికలకు ముందు పంట రుణం తీసుకున్న తోటి రైతుకు ష్యూరిటీ సంతకం పెట్టినందుకు ఓ రైతుకు ఆ బ్యాంక్‌ మేనేజర్‌ రైతుబంధు, పింఛను డబ్బులను ఫ్రీజ్‌ చేయించారు.

రైతుబంధు, పింఛను డబ్బులు ఇవ్వబోం!

  • ష్యూరిటీ సంతకం పెట్టిన రైతుకు బ్యాంకు మేనేజర్‌ షాక్‌.. గతంలో రుణం చెల్లించని రైతు ధాన్యం డబ్బు ఫ్రీజ్‌

  • సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ నిర్వాకం

పుల్‌కల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): గత ఎన్నికలకు ముందు పంట రుణం తీసుకున్న తోటి రైతుకు ష్యూరిటీ సంతకం పెట్టినందుకు ఓ రైతుకు ఆ బ్యాంక్‌ మేనేజర్‌ రైతుబంధు, పింఛను డబ్బులను ఫ్రీజ్‌ చేయించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాకు చెందిన హట్యా రాములు ఐదేళ్ల క్రితం చౌటకూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో పంట రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. హట్యా రాములుకు రుణమాఫీ జరగలేదు. అయితే, హట్యా రాములు రుణం తీసుకున్నప్పుడు చౌటకూర్‌కు చెందిన రైతు బేగరి రాములు ష్యూరిటీ సంతకం పెట్టాడు. బేగరి రాములుకు ఇటీవల ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రూ.6వేలను ఖాతాలో జమచేసింది. ఆసరా పింఛను కింద మరో రూ.2వేలు జమయ్యాయి. ఈ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బేగరి రాములు మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లాడు. ‘నువ్వు హట్యా రాములుకు జామీనుగా ఉన్నావు.. అతడు రుణం తిరిగి చెల్లించడం లేదు.. అందుకే నీ అకౌంట్‌లో ఉన్న డబ్బు హట్యా రాములు అప్పు కిందకు జమ చేసుకుంటున్నాం’ అని బ్యాంక్‌ మేనేజర్‌ మాధవరెడ్డి తేల్చి చెప్పారు. కంగుతిన్న బేగరి రాములు, హట్యా రాములుకు సమాచారమిచ్చాడు. ఆయన బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్‌తో కలిసి మేనేజర్‌ మాధవరెడ్డిని నిలదీశారు. ఇదే విషయంపై జిల్లా అనదనపు కలెక్టర్‌ పాండుతో ఫోన్‌లో మాట్లాడగా, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇదే బ్యాంకులో బద్రిగూడేనికి చెందిన గంగయ్య కూడా గత ఎన్నికల ముందు పంట రుణం తీసుకోగా మాఫీ కాలేదు. ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బు ఖాతాలో జమ కాగా, రుణం చెల్లించనందున ఆ ఖాతాను బ్యాంకు సిబ్బంది ఫ్రీజ్‌ చేశారు.

Updated Date - Apr 29 , 2026 | 07:19 AM