Share News

చూసొద్దామా రైతుబడి!

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:44 AM

అన్నదాతల కోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ’రైతుబడి అగ్రిషో-3వ ఎడిషన్‌’ ఆకట్టుకుంటోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అగ్రి షోను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి శుక్రవారం .....

చూసొద్దామా రైతుబడి!

  • చీఎన్టీఆర్‌ స్టేడియంలో రైతుబడి అగ్రిషో షురూ.. సాగు పనిముట్లు, భారీ యంత్రాల ప్రదర్శన

  • ప్రత్యేక ఆకర్షణగా భారీ డ్రోన్‌.. ఒకేరోజు 50 ఎకరాల్లో పురుగుల మందు పిచికారీ

  • 300కు పైగా స్టాళ్లు..3 రోజుల పాటు ప్రదర్శన

  • సాగు దిశగా యువత ఆసక్తి చూపాలి: గుత్తా

హైదరాబాద్‌ సిటీ, కవాడిగూడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అన్నదాతల కోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ’రైతుబడి అగ్రిషో-3వ ఎడిషన్‌’ ఆకట్టుకుంటోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అగ్రి షోను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 300కు పైగా స్టాళ్లలో సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, సాంకేతిక పరికరాలు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను ప్రదర్శనకు ఉంచారు. తొలిరోజు 25వేల మందికి పైగా రైతులు ప్రదర్శనను సందర్శించినట్లు రైతుబడి నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో భాగంగా పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లు, బోరుమోటార్లు, ట్రాక్టర్‌ టైర్లు, పొలం వద్ద రాత్రుల్లో ఉపయోగించేందుకు టార్చిలైట్లు ఉంచారు. తెలంగాణ, ఏపీ నుంచి రైతులు వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. మరికొన్నింటి కోసం ఆర్డర్‌ పెట్టుకుంటున్నారు. కాగా పది లీటర్ల నుంచి 30 లీటర్ల మందును ఒకేసారి గాల్లోకి తీసుకెళ్లి పిచికారీ చేసే డ్రోన్లు ఆకట్టుకున్నాయి. ఈ రకం డ్రోన్‌తో రోజుకు 50 ఎకరాల్లో పురుగుల మందును పిచికారీ చేయొచ్చు. దీన్ని నిరుద్యోగ యువకులు కొనుక్కొని అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.లక్ష వరకు సంపాదించవచ్చునని నిర్వాహకులు చెప్పారు. నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్‌లో డ్రోన్ల వినియోగం ఎక్కువగా ఉందని శ్రీవిఘ్నేశ్వర డ్రోన్స్‌ యజమాని సంతో్‌షరెడ్డి తెలిపారు. కాగా ప్రదర్శనలో భారీ ఎలక్ర్టిక్‌ సెల్ఫ్‌ ప్రాపెల్లెడ్‌ భూమ్‌ స్ర్పేయర్‌ ఆకట్టుకుంటోంది. ఈ యంత్రం 600 లీటర్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. పొలంలో 10 మీటర్ల వెడల్పుతో, 450-1800 మిల్లీమీటర్ల ఎత్తులో మందును పిచికారీ చేయగలదని నిర్వాహకులు తెలిపారు. ఎకరం పొలాన్ని 5నిమిషాల్లో స్ర్పే చేయొచ్చునని చెప్పారు.


శాటిలైట్‌ ద్వారా భూసార పరీక్షలు

శాటిలైట్‌ ద్వారా సేకరించిన ఆధారాలతో సాగుభూమిని పరీక్షించి భూసార పరీక్షలపై తగు నివేదిక ఇస్తున్నట్లు ప్రదర్శన సందర్భంగా సినాగ్రో ఇండియా సీఈవో బోయినేని నవీన్‌ తెలిపారు. ఈ మేరకు భూమిలో నైట్రోజన్‌, పాస్పరస్‌, పోటాషియం, సాయిల్‌ ఆర్గానిక్‌ కార్బన్‌, సాయిల్‌ పొటెన్షియల్‌ ఆఫ్‌ హైడ్రోజన్‌ ఎంతమేర ఉందనే సమాచారాన్ని ‘పెయిడ్‌ మొబైల్‌ యాప్‌’ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు. రైతులు, ప్లే స్టోర్‌లోకి వెళ్లి సినాగ్రో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. సెల్‌ నంబర్‌, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని, ఇలా యాప్‌లో చూపించిన విధంగా ముందుకుసాగితే తగిన సమాచారం లభిస్తుందన్నారు.. ఈ యాప్‌ సేవల కోసం తమకు ఒక్కసారి రూ.706 ఫీజు చెల్లిస్తే 6 నెలలపాటు సేవలందిస్తామని చెప్పారు.

జై జవాన్‌... జై కిసాన్‌

అగ్రిషోలో రిటైర్డ్‌ సైనిక ఉద్యోగుల స్టాల్‌ ఆకట్టుకుంటోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగ విరమణ పొందిన వారు కొన్నేళ్ల క్రితం జట్టుగా కలిశారు. సేంద్రియ ఉత్పత్తులను తయారు చేసి తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వర కోఆపరేటివ్‌ పవర్‌ అండ్‌ అగ్రో ప్రాసెసింగ్‌ లిమిటెడ్‌ను ప్రారంభించారు. నాసిక్‌లో 28 ఎకరాల్లో ప్రారంభించిన సేంద్రియ ఉత్పత్తుల సాగు ప్రస్తుతం 700 ఎకరాలకు పెరిగిందని రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌ సుబేదార్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు.


యంత్రాలతో సాగు లాభసాటి

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఆధునిక యంత్రాలతో సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఆగ్రిషోను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయనే మాటలు తప్పని.. సరైన పద్ధతుల్లో ఆధునిక యంత్రాల సహకారంతో వ్యవసాయం చేస్తే లాభాలు చూడవచ్చని రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంపై యువత ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందన్నారు. రైతుబడి వ్యవస్థాపకులు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడమే ప్రదర్శన ఉద్దేశమని తెలిపారు. ప్రతిభ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ పదార్ధాల సమతుల్య వ్యవసాయాన్ని తమ సంస్థ ద్వారా రైతులకు పరిచయం చేస్తున్నామని తెలిపారు.

షో ఉందని తెలిసి..

గత ఏడాది మా అనంతపురం జిల్లాలో ఈ ప్రదర్శన పెట్టారు. అప్పుడు అక్కడికి వెళ్లి మోటార్లు, పైపులు, ఇతర వస్తువులు బుకింగ్‌ చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను. షో ఉందని తెలిసి గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చాను. స్టాళ్లు అన్నింటినీ చూశాను. 100 గ్రాముల మిల్చింగ్‌ మిషన్‌ షీట్‌, ఇతర వస్తువులను తీసుకెళ్తాను.

-ఈశ్వర్‌రెడ్డి, అనంతపురం, ఏపీ

3 బస్సుల్లో వచ్చాం

అగ్రిషోకు మా ములకనూరు కోఆపరేటివ్‌ సొసైటీ నుంచి శుక్రవారం మూడు బస్సుల్లో 150 మంది రైతులు వచ్చాం. ఇక్కడ హార్వెస్టర్లు, పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి. బోరు మోటార్లు, ఇతర వస్తువులను చూశాం. కొన్నింటిని ఆర్డర్‌ పెట్టాలనుకుంటున్నాం. శనివారం మరో 150 మంది రైతులు ఇక్కడికి వస్తారు.

- శ్రీనివా్‌సరెడ్డి, ములకనూరు, సిద్దిపేట

Updated Date - Feb 21 , 2026 | 03:44 AM