Share News

వేములవాడలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:37 AM

శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాస తొలి సోమవారం రోజున కోటి పుణ్యఘడియల్లో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోటి సోమవారం పురస్కరించుకుని ఉదయం నుంచే సుమారుగా ఒక లక్ష వరకు భక్తులు

 వేములవాడలో భక్తుల రద్దీ
భీమన్న దర్శనం కోసం క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న భక్తులు

వేములవాడ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాస తొలి సోమవారం రోజున కోటి పుణ్యఘడియల్లో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోటి సోమవారం పురస్కరించుకుని ఉదయం నుంచే సుమారుగా ఒక లక్ష వరకు భక్తులు తరలిరావడంతో ఆలయ పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు తెల్లవారు జామున కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పవిత్రస్నానాలను ఆచరించారు. శ్రీస్వామి వారి దర్శనం కోసం భక్తులు ధర్మ దర్శనం క్యూలైన్‌లో సుమారుగా 4 గంటలపాటు నిరీక్షించారు. క్యూలైన్‌ జనరేటర్‌ రూమ్‌ దాటిపోయి రాజన్న ఆలయ చెక్‌పోస్టు వరకు క్యూలైన్‌ పెరగడంతో పోలీసులు ప్రత్యేకంగా తాళ్లతో, భారీకెడ్లతో క్యూలైన్‌లను క్రమబద్ధీకరించారు. బ్రేక్‌దర్శనం టికెట్ల కోసం పీఆర్వో కార్యాలయం వద్ద భక్తులు పోటిపడ్డారు. శ్రీస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో గంటలతరబడి నిరీక్షించినట్లు తెలిపారు. ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ భీమేశ్వర స్వామి అభిషేక పూజలో పాల్గొని తరించారు. శ్రీస్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. గండాదీపంలో నూనేపోస్తూ గండాలు తొలగిపోవాలని, కార్తీక మాసం పురస్కరించుకుని శివుడికి కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. శ్రీనగరేశ్వర స్వామి ఆలయంలో సత్యనారయణస్వామి వ్రతాలు, చంఢీహోమం కార్యక్రమంలో పాల్గొనగా శివపార్వతుల కల్యాణానికి హజరైన భక్తులు మొక్కులు చెల్లించుకుని తరించారు.

భక్తుల రద్దీని ఈవో రమాదేవి, డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆలయ పరిసరాలను సందర్శించారు. భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయి పరిశీలించారు.

సామూహిక కార్తీక దీపోత్సవం..

శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భీమన్న ఆలయ ఆవరణలో ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సామూహిక కార్తీక దీపోత్స వాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, సుహాసినులు హజరై పలు ఆకృతుల్లో, తీరొక్క పూలతో అందంగా అలంకరించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో శివునికి దీపం వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని రాజన్న ఆలయ అర్చకులు భక్తులకు కార్తీక మాస విశిష్టతను వివరించారు.

Updated Date - Nov 17 , 2026 | 12:37 AM