పొగ తాగేస్తున్నారు.. పెగ్గు లేపేస్తున్నారు
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:36 AM
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఖైనీ, గుట్కాలతో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు...
మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగంలో తెలంగాణ గ్రామీణం దేశంలోనే టాప్
నెలకు సగటున రూ.396 ఖర్చు.. జాతీయ సగటు రూ.158
జాతీయ సగటు కంటే రెండింతల అధికం
ఆందోళన కలిగిస్తున్న జీవన విధానం
హెచ్‌సీఈఎ్‌స 2023-24 సర్వేలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఖైనీ, గుట్కాలతో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు... అంటూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేసే ప్రచారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. కుటుంబాలను చిదిమిసే ఈ అలవాట్ల కోసం తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజానీకం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎంతలా అంటే తమ సంపాదనలో అధిక భాగాన్ని ఆహారం, ఆరోగ్యం, విద్య కంటే గుట్కా, ఖైనీ, సిగిరెట్లు, మద్యానికే కేటాయిస్తున్నారు. ఈ ఖర్చు దేశ సగటు కంటే రెండింతలు అధికంగా ఉండడం అత్యంత ఆందోళనకరం. కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే(హెచ్‌సీఈఎ్‌స) 2023-24లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ సర్వే ప్రకారం.. పొగాకు, మద్యం వినియోగంలో గ్రామీణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పొగాకు, మద్యం వంటి వాటిపై నెలకు సగటున రూ.396 ఖర్చు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ సగటు రూ.158 మాత్రమే ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ నెలవారీ తలసరి వ్యయంలో సుమారు 7.3 శాతాన్ని మత్తుపదార్థాలకే కేటాయిస్తున్నారు. ఇది దేశంలోనే రెండో అత్యధికం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మొత్తం నెలసరి వ్యయం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నెలవారి తలసరి వ్యయం సగటున రూ.5,435 ఉండగా పట్టణ ప్రాంతాల్లో రూ.8,978గా ఉంది. ఇవి జాతీయ స్థాయి సగటులు వరుసగా రూ.4122, రూ.6996 కంటే అత్యధికం.
పట్టణాల కంటే పల్లెల్లోనే ఖర్చు ఎక్కువ
పట్టణ ప్రాంతాల్లోని వారి కంటే పల్లెల్లోని వారే మత్తు పదార్థాల కోసం అధికంగా ఖర్చు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో.. పొగాకు, మద్యం ఉత్పత్తులపై పట్టణ ప్రాంతాలకు చెందిన ఓ వ్యక్తి నెలకు సగటున రూ.158 ఖర్చు చేస్తుండగా.. గ్రామీణ ప్రాం తాల వారు రూ.166 ఖర్చు పెడుతున్నారు. కాగా, అల్పాదాయ వర్గాల్లో గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులపై పెడుతున్న ఖర్చు విద్యపై పెడుతున్న ఖర్చు కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఈ అలవాట్ల వల్ల ప్రజలు దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వాధ్యుల బారిన పడే ముప్పు అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండే వారి వైద్య ఖర్చు నెలకు సగటున రూ.282 ఉందని, పట్టణాల్లో రూ.409 ఉన్నట్లు సర్వే పేర్కొం ది. ఈ ఖర్చులు చాలావరకు పొగాకు, మద్యం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నట్లు గుర్తించారు. గ్రామీణ ప్రజలు తమ ఆదాయంలో అ త్యధిక వాటాను పొగాకు, మద్యం కోసం ఖర్చు పెడుతుండడం వల్ల దీర్ఘకాలంలో సామాజిక, ఆరోగ్య సం క్షోభం తలెత్తే ముప్పు ఉందని హెచ్చరించారు.
మహిళలపై పరోక్ష భారం
మద్యం, ఇతర మత్తు పదార్థాల వినియోగ ఖర్చు పెరగడం వల్ల గ్రామీణ మహిళలపై కుటుంబ భారం పరోక్షంగా పడుతుందని నివేదిక పేర్కొంది. మద్యం, పొగాకు వ్యసనాలకు పెడుతున్న ఖర్చు వల్ల కుటుంబ పోషణ, గృహ ఖర్చుల భారాన్ని మహిళలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. దీనిని కేవలం ఖర్చుల సర్వేలా కాకుండా.. గ్రామీణ కుటుంబాల సామాజిక అలవాట్లు, కుటుంబ భవిష్యత్తు కోణంలో ప్రభుత్వాలు చూడాల్సిన అవసరముందని కేంద్ర గణాంకాల శాఖ అధికారులు, నిపుణులు పేర్కొన్నారు.