బీఆర్‌ఎస్‌కు ప్రశ్నించే హక్కు లేదు: కార్మిక సంఘాలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:39 AM
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్‌ఎస్ నాయకులకు లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలోనే యూనియన్లను రద్దు చేశారని, రెండు వేతన సవరణలు పెండింగ్‌లో పెట్టారని గుర్తు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్‌ఎస్ నాయకులకు లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలోనే యూనియన్లను రద్దు చేశారని, రెండు వేతన సవరణలు పెండింగ్‌లో పెట్టారని గుర్తు చేశారు. విలీన ప్రక్రియను మధ్యలోనే వదిలివెళ్లారని.. పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది బీఆర్‌ఎస్ పార్టీనేనని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమ్మె చేస్తే బెదిరింపు ధోరణిలో కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఒక్క బీఆర్‌ఎస్ నాయకుడు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా సమ్మెకు మద్దతుగా వచ్చారని పేర్కొన్నారు. నాడు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే స్థానిక బీఆర్‌ఎస్ నాయకులైనా పరామర్శకు రాలేదని, సంతాపం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు నేరుగా మంత్రి, సంస్థ ఎండీ ఆస్పత్రికి వచ్చి కార్మికుడి కుటుంబ సభ్యులను కలిశారని, తామున్నామనే భరోసా కల్పించారని టీపీసీసీ ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ కె.రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ బస్సుల పథకంతోనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, మెకానికల్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందని మండిపడ్డారు.