ఆ 3 డిమాండ్లపైనే పీటముడి!
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:05 AM
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన ఆర్టీసీ కార్మికులు.. స్వరాష్ట్రంలో రెండోసారి సమ్మెబాట పట్టారు. గత ప్రభుత్వ హయాంలో ...
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణకు కార్మికుల పట్టు
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన ఆర్టీసీ కార్మికులు.. స్వరాష్ట్రంలో రెండోసారి సమ్మెబాట పట్టారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రెండు నెలలు సమ్మె చేశారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా సమస్యల పరిష్కారంవైపు అడుగులు వేయకపోవడంతో ఆర్టీసీ కార్మికులు నోటీసు ఇచ్చి సమ్మెలోకి దిగారు. సరిగ్గా ఏడాది క్రితం సమ్మె నోటీసు ఇవ్వగా.. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో చివరి నిమిషంలో సమ్మె వాయిదా వేశారు. ఈసారి సమ్మెకు దిగిన కార్మిక సంఘాలు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 32 డిమాండ్లతో సమ్మెలోకి దిగిన కార్మికులు అవన్నీ పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టాయి. అయితే 32 డిమాండ్లలో 29 పరిష్కరిస్తామని, మూడు అంశాల విషయంలో మాత్రం గడువు కావాలని ప్రభుత్వం చెబుతోంది. కార్మిక సంఘాలు మాత్రం ఆ మూడు డిమాండ్లే ప్రధానమైనవని, వాటిని పరిష్కరించాలని పట్టుబడుతున్నాయి. ఇదే పీటముడిగా మారింది. మూడు ప్రధాన డిమాండ్లలో మొదటిది... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆర్టీసీ ప్రభుత్వ రంగ రవాణా సంస్థ అయినప్పటికీ ఇందులో పనిచేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకపోవడమే తాజా సమ్మెకు ప్రధాన కారణంగా మారింది. విలీనం కాకపోయినా... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కార్మికులు ఏకీభవించడం లేదు. రెండో ప్రధాన డిమాండ్... వేతన సవరణ. ప్రస్తుతం జీవనవ్యయం పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. మూడోది కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు పొందిన సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం. ఈ మూడు అంశాల విషయంలో తక్షణం నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం అధికారుల కమిటీ ఏర్పాటుచేసి అధ్యయనం చేసేందుకు నాలుగు వారాల గడువు కోరింది. కమిటీ ఏర్పాటు కాలయాపనగా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి వద్ద శుక్రవారం జరిగే సమావేశంలో ఈ మూడు అంశాలపై పీటముడి వీడుతుందా... ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే దానిపై కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి కాకుండా కార్మిక సంఘాలు చేస్తున్న మిగతా డిమాండ్లలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం వారితో చర్చల తర్వాత స్పష్టమైన ప్రకటన చేయనుంది. ఇందులో కొన్ని ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉండటంతో ఇప్పటికే ఆర్థిక విభాగం అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలిసింది. కార్మికుల డిమాండ్లలో పనిగంటలు ఒకటి. 8 గంటల పని, మహిళా ఉద్యోగినులకు సౌకర్యాలు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.