సమస్యల్ని పరిష్కరించాలని..ఇందిరాపార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:44 AM
ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. మార్చి 13వ తేదీలోపు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించి...
సర్కార్ స్పందించకుంటే మెరుపు సమ్మె తప్పదు: ఆర్టీసీ జేఏసీ
కవాడిగూడ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. మార్చి 13వ తేదీలోపు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మె నోటీసు జారీ చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో చలో సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆర్టీసీ కార్మికులు వందలాదిమంది తరలివచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాలలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉండాలే తప్ప అధికారుల పక్షం ఉండకూడదన్నారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రెండేళ్లైనా విలీన ప్రక్రియ నేటికీ మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎం. థామ్‌సరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాలో ఆర్టీసీని నీర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేబాటలో వెళ్తోందని మండిపడ్డారు.