నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:46 AM
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతోంది. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, చర్చలకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో పూర్తిస్థాయిలో సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సోమవారం ఉదయం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు తెలిసింది. ‘‘ఇది మరో సకల జనుల సమ్మెగా కార్యరూపం దాల్చుతుంది. సమ్మెకు అందరి సహకారం సంపూర్ణంగా ఉంది. ప్రైవేటు సిబ్బందితో సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం, యాజమాన్యం భావిస్తే... ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. సమ్మెను విజయవంతం చేసి సమస్యలను పరిష్కరించుకుంటాం’’ అని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. సమస్యలపై మంగళవారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే.. మెజార్టీ యూనియన్ల జేఏసీగా తామూ సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక, ప్రధాన కార్యదర్శి అశ్వత్ధామ రెడ్డి తెలిపారు.