రైట్.. రైట్
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:56 AM
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి ప్రకటించారు.
ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం
దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ.. జూన్ 2న విలీన ప్రకటన
ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి
ఫిట్‌మెంట్‌పై సుదీర్ఘ చర్చ.. 10 శాతానికి అంగీకారం
కార్మిక సంఘాల 31 డిమాండ్లలో 28 బేషరతుగా పరిష్కారం
గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నారు
ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ప్రశ్నించే హక్కు లేదు: కార్మిక సంఘాలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, దానకిషోర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఉదయం 10 గంటలకు చర్చలు మొదలయ్యాయి. తొలుత అధికారుల కమిటీతో కార్మిక సంఘాల నాయకులు సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. తర్వాత రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చాంబర్‌లో ప్రధాన చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు కాసేపు భోజన విరామం తీసుకుని, మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. కార్మికులు ముందుపెట్టిన 31 డిమాండ్లలో ప్రధానమైన మూడు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్యలు చేపడతామని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కార్మిక నాయకులకు హామీ ఇచ్చింది.
ఉప సంఘం పరిశీలన అనంతరం ఆర్టీసీ విలీనంపై జూన్ 2న ప్రకటన చేస్తామని పేర్కొంది. కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు పొందని యూనియన్ల (ట్రేడ్ యూనియన్ల)కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నాయకులకు సూచించింది. అయితే ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 వేతన సవరణలపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కార్మిక సంఘాలు 30ు ఫిట్‌మెంట్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం తొలుత 5శాతం ప్రతిపాదించింది. కానీ కనీసం 20శాతమైనా ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. దీనితో చాలాసేపు తర్జనభర్జన జరిగింది. చివరికి 10శాతం ఫిట్‌మెంట్‌పై సయోధ్య కుదిరింది. మొత్తంగా 28 డిమాండ్లను ప్రభుత్వం బేషరతుగా పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. సమ్మె కాలంలో కార్మికులపై నమోదైన కేసుల ఎత్తివేత విషయంలోనూ సానుకూలంగా స్పందించింది. తమ సమస్యల పరిష్కారానికి సిద్ధంకావడంపై కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా సమ్మెలో ప్రాణత్యాగం చేసిన డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు కార్మిక సంఘాల నాయకులు నివాళి అర్పించారు.