నిండాముంచి ఇప్పుడు కమిటీలా?
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:19 AM
ఆర్టీసీని నిండా ముంచి ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు.
‘విలీనం’ హామీని మర్చిపోయిన సీఎం
సమ్మెకు మా సంపూర్ణ మద్దతు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని నిండా ముంచి ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ మాటలు ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే రేవంత్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని విమర్శించారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి వందల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా ఆర్టీసీని దివాలా తీయించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. సీఎం మొండివైఖరి వీడాలని, తక్షణమే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, 32 డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే చూపుతోందని రాంచందర్‌రావు అన్నారు. కమిషన్ విధి విధానాలు, నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు.