ఆర్టీసీలో సిబ్బందికి డిప్యుటేషన్లు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:19 AM
కాలుష్య రహిత రవాణా కోసం ఆర్టీసీ ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బస్సులకు చెందిన సిబ్బందిని...
గ్రేటర్‌లో పెరిగిన ఈవీ బస్సుల వాడకం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : కాలుష్య రహిత రవాణా కోసం ఆర్టీసీ ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బస్సులకు చెందిన సిబ్బందిని డిప్యుటేషన్లపై సంస్థలోని ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈవీ బస్సులు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. అదనంగా సుమారు 2 వేల బస్సులను నాలుగు దశల్లో ప్రవేశపెట్టేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 300కు పైగా ఈవీలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి 23న ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌కు చెందిన డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామిక్‌లను హైదరాబాద్, కరీంనగర్ జోన్‌లలో డిప్యుటేషన్ పద్ధతిలో మార్చేందుకు నిర్ణయించారు. ఆమేరకు సిబ్బంది నుంచి సుముఖత సేకరిస్తున్నారు. పదో తరగతి అర్హత ఉన్న డ్రైవర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో కండక్టర్లుగా మారేందుకు ఆప్షన్ ఇవ్వొచ్చు. మెకానిక్‌లను ఏడీసీలుగా, బస్‌పాస్ కౌంటర్లలోనూ, హెవీ వెహికల్ లైసెన్సు ఉంటే పార్కింగ్ డ్రైవర్లుగా ఓడీ ప్రాతిపదికన నియమించనున్నారు. సిబ్బంది తమ ఆప్షన్ తెలిపేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చారు.