Share News

మంటలు చెలరేగి.. ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:08 AM

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగి.. చూస్తుండగానే క్షణాల్లో దగ్ధమైంది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో త్రుటిలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

మంటలు చెలరేగి.. ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

  • డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం

  • కరీంనగర్‌ సమీపంలోని అలుగునూర్‌ శివారులో ఘటన..

తిమ్మాపూర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగి.. చూస్తుండగానే క్షణాల్లో దగ్ధమైంది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో త్రుటిలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్‌-2 డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్‌ బస్సు డ్రైవర్‌ సహా 42 మందితో కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరింది. అలుగునూర్‌ దాటి తర్వాత కాకతీయ కాలువ వద్దకు చేరుకోగానే బస్సులో నుంచి కాలిన వాసన రావడంతో డ్రైవర్‌ బోయిని ప్రశాంత్‌ అప్రమత్తమయ్యాడు. సమీపంలో పెట్రోల్‌ బంక్‌, విద్యుత్తు తీగలుండటంతో ప్రమాదాన్ని ఊహించి కొంచెం ముందుకు తీసుకెళ్లి రోడ్డు పక్కన సురక్షిత ప్రాంతంలో నిలిపేశాడు. వెంటనే ఎమర్జెన్సీ డోర్‌ తెరవడంతో పాటు అందరూ దిగిపోవాలని కోరాడు. ఆందోళనలో కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని కిటికీల నుంచి బయటకు దూకారు. ప్రయాణికులు దిగిన కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీలు ఉన్న బాక్సుల నుంచి మంటలు వేగంగా వ్యాపించి బస్సును చుట్టుముట్టాయి. డయల్‌ 100కు కాల్‌ చేయడంతో ఎల్‌ఎండీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగిన 40 నిమిషాలకు ఫైరింజన్‌ సంఘటనా స్థలానికి చేరుకుంది. మూడు ఫైర్‌ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకు పైగా శ్రమించి మంటలకు అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆర్టీసీలో జేబీఎం ఎకో కంపెనీ నుంచి అద్దె ప్రతిపాదికన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారికావడంతో.. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీసు శాఖల అధికారులు విచారణ చేపడుతున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 05:08 AM