Share News

శంకర్‌గౌడ్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:02 AM

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెట్రోల్‌ పోసుకుని, నిప్పంటించుకున్న డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.

శంకర్‌గౌడ్‌ కన్నుమూత

  • గురువారం అర్ధరాత్రి దాటాక మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌

  • అపోలో ఆస్పత్రిలోనే పోస్టుమార్టం

  • మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లేందుకు కార్మికులు, బీజేపీ నేతల యత్నం

  • అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

  • రాత్రి 7 గంటలకు అంత్యక్రియలు

  • శంకర్‌ మృతిపట్ల సీఎం దిగ్ర్భాంతి

  • రూ.15 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఆర్టీసీ ఉద్యోగం, ఇల్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెట్రోల్‌ పోసుకుని, నిప్పంటించుకున్న డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా కార్మికుల ఆందోళన, బీజేపీ నేతల హడావుడితో కాస్త హైడ్రామా చోటు చేసుకుంది. మరోవైపు శంకర్‌గౌడ్‌ మృతి విషయం తెలిసిన ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో శంకర్‌గౌడ్‌కు నివాళి అర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె, ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. పలుచోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపారు. శంకర్‌గౌడ్‌ మృతితో ఆర్టీసీ కార్మికులు ఉద్వేగానికి లోనవడంతో ముందుజాగ్రత్తగా పోలీసులు ఎక్కడిక్కడ బందోబస్తును మరింత పెంచారు. కార్మికుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆందోళనల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని మద్దతు ప్రకటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు బలవంతంగా బస్సులు బయటికి తీయకుండా సంయమనం పాటించారు. దీనితో గురువారంతో పోలిస్తే శుక్రవారం రోడ్డెక్కిన బస్సుల సంఖ్య కాస్త తగ్గింది. దీనితో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. దాదాపు రెండింతలు చార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించారు.


ర్యాలీలు, మానవహారాలతో నిరసన

మహబూబ్‌నగర్‌లో, మణుగూరులో భారీ మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. నారాయణపేట, ఖమ్మంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్‌, గోదావరిఖని, మంచిర్యాలలో ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పాల్గొని మద్దతు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నోటికి నల్ల రిబ్బన్లతో భారీ ర్యాలీ చేశారు. పాత కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్‌లో బస్సు డిపో ముందు కార్మికులు చేపట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. నిర్మల్‌, భైంసా, మెదక్‌, సంగారెడ్డిలలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని, మౌన ప్రదర్శనలు నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌నగర్‌ బస్‌డిపో వద్ద కార్మికులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న బీజేపీ, వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ డిపో వద్ద శంకర్‌గౌడ్‌కు నివాళి అర్పిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద శంకర్‌గౌడ్‌కు ఎమ్మెల్సీ కోదండరామ్‌ నివాళులు అర్పించారు. కాగా, పోలీసులు డిపోలు, బస్టాండ్ల వద్ద టెంట్లను వేసుకోనివ్వకపోవడం, వేసినవాటిని తొలగించడంతో.. చాలా చోట్ల కార్మికులు ఎండలోనే సమ్మె ఆందోళనలను కొనసాగించాల్సి వచ్చింది. డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి నేపథ్యంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. సమ్మె మొదటి, రెండో రోజు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్‌ బస్సులను పలు రూట్లలో తిప్పగా.. శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో బస్సులు నడపలేమని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. దీనితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు..

డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేశ్‌లను వరంగల్‌ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. శంకర్‌గౌడ్‌ అంత్యక్రియల కోసం బయలుదేరిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, మాజీ ఎంపీలు వినోద్‌కుమార్‌, మాలోతు కవితలను జనగామ జిల్లాలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సీఎం అహంకారానికి శంకర్‌గౌడ్‌ బలయ్యారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.


తీవ్రగాయాలతో పరిస్థితి విషమించి..

వరంగల్‌ జిల్లా నర్సంపేట బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని, నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులు, పోలీసులు ఆయనను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఆయన శ్వాసతీసుకోలేక ఇబ్బందిపడటంతో సీపీఆర్‌ చేశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత 2.45 గంటలకు శంకర్‌గౌడ్‌ కన్నుమూశారు. ఆస్పత్రి బయట భారీగా ఆర్టీసీ కార్మికులు గుమిగూడి ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందాన్ని అపోలో ఆస్పత్రికి రప్పించి శంకర్‌గౌడ్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30 గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ బందోబస్తు మధ్య నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తరలించారు. శంకర్‌గౌడ్‌కు సొంతిల్లు లేకపోవడంతో ఆయన కుమార్తె ఉండే ముత్తోజిపేటకు తీసుకెళ్లారు.


15 లక్షలు సాయం.. ఆర్టీసీ ఉద్యోగం

ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. అందులో ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, స్థానిక ఎమ్మెల్యే ఫండ్‌ నుంచి రూ.5 లక్షలు అందించనున్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ప్రకటించారు.

ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని దుఖసాగరంలో ముంచిందని విచారం వ్యక్తం చేశారు. శంకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.


ఉద్రిక్తతల మధ్య అంత్యక్రియలు

ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ మృతి, అంత్యక్రియల నర్సంపేట, ముత్తోజిపేటలలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, బీజేపీ నేతలు చేరుకోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన కనిపించింది. శుక్రవారం ఉదయం ముత్తోజిపేట నుంచి శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని కార్మికులు పట్టుబట్టారు. కానీ పోలీసులు అంగీకరించలేదు. కాసేపటికే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ముత్తోజిపేటకు చేరుకున్నారు. శంకర్‌గౌడ్‌ మృతదేహానికి నివాళులు అర్పించారు. తర్వాత సంజయ్‌ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగాయి. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ బండి సంజయ్‌ సహా అంతా ముత్తోజిపేట రహదారిపై బైఠాయించారు. పాతికేళ్లపాటు నర్సంపేట డిపోలో పనిచేసిన శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని అక్కడికి తీసుకెళితేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని పట్టుబట్టారు. ఒకదశలో ఫ్రీజర్‌ బాక్స్‌ నుంచి మృతదేహాన్ని బయటికి తీసి.. నర్సంపేట డిపోకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ వచ్చి కేంద్రమంత్రి సంజయ్‌తో మాట్లాడారు. డీజీపీ శివధర్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఫోన్‌లో బండి సంజయ్‌తో మాట్లాడారు. చివరి కేంద్ర మంత్రి, ఆర్టీసీ కార్మికులు, శంకర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గారు. సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించారు. శంకర్‌గౌడ్‌ కుమారుడు హేమంత్‌ తండ్రికి తలకొరివిపెట్టారు.

Updated Date - Apr 25 , 2026 | 06:05 AM