Share News

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:38 AM

తన అప్రమత్తతతో 19 మందికి ప్రమాదం తప్పించిన ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఈ విషాదం నెలకొంది.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

  • బస్సు నడుపుతుండగా ఛాతీ నొప్పి

  • పక్కకు నిలిపి సీటులోనే కుప్పకూలిన వైనం

  • అప్రమత్తతతో 19 మందికి తప్పిన ప్రమాదం

యాదాద్రి, చౌటుప్పల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : తన అప్రమత్తతతో 19 మందికి ప్రమాదం తప్పించిన ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఈ విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడ డిపోనకు చెందిన ఏపీ16జడ్‌ 0323 నెంబరు గల ఆర్టీసీ బస్‌(అమరావతి) హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి విజయవాడకు బయలుదేరింది. సోమవారం మధ్యాహ్నం చౌటుప్పల్‌ వద్దకు చేరుకోగా డ్రైవర్‌ నాగరాజు(38)కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ప్రధాన రహదారి నుంచి బస్సును సర్వీసు రోడ్డులోకి తీసుకువచ్చి నిలిపివేశారు. డ్రైవింగ్‌ సీటులోనే కుప్పకూలడంతో వెంటనే ప్రయాణికులు ఆటోలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఈసీజీ తీసి మృతి చెందినట్టుగా నిర్ధారించారు. నాగరాజు స్వస్థలం కృష్ణాజిల్లా గొల్లపూడి కాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బస్సులోని 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండగా, తమను ప్రమాదం నుంచి తప్పించిన డ్రైవర్‌ నాగరాజు మృతి చెందడంపై వారిలో విషాదం నెలకొంది. ప్రయాణికులను ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు.

Updated Date - Jan 27 , 2026 | 03:38 AM