సీఎంకు పనిలేదు.. అందుకే ఫ్రీ బస్సు పెట్టాడు
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:51 AM
ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాల్సిన ఆర్టీసీ సిబ్బందిలో.. కొందరు అతిగా వ్యవహరిస్తూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారు
ప్రయాణికురాలితో కండక్టర్ నోటి దురుసు
రాత్రివేళలో బస్సు దిగిపోవాలంటూ హుకూం
సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు
పుల్‌కల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాల్సిన ఆర్టీసీ సిబ్బందిలో.. కొందరు అతిగా వ్యవహరిస్తూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, మహిళా ప్రయాణికులను అవమానపరుస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రయాణికురాలిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ కండక్టర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. చౌటుకూరుకు చెందిన ఓ మహిళ సోమవారం రాత్రి జోగిపేట బస్‌స్టా్‌పలో మెదక్ డిపోకు చెందిన పటాన్‌చెరు బస్సు ఎక్కింది. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ వైపు ఉన్న సీట్ల వద్ద నిలబడగా, కండక్టర్ ఆమె చేయి పట్టుకుని తోసివేసి, దురుసుగా ప్రవర్తించాడు. ‘‘సీఎంకు ఏం పని లేదు.. ఫ్రీ బస్సు పెట్టడంతో మహిళలు పనిపాట లేక బస్సులో తిరుగుతున్నారు’’ అంటూ ప్రయాణికులందరి ముందును మహిళను అసభ్యకరంగా దూషించాడు. కండక్టర్ తీరును సదరు మహిళ నిలదీయడంతో మరింత రెచ్చిపోయాడు. బస్సు ఆందోల్ వద్దకు రాగానే ఆమెను దిగిపోవాలంటూ హుకూం జారీ చేశాడు. అయితే, కండక్టర్ ప్రవర్తన గమనించిన తోటి ప్రయాణికులు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. రాత్రివేళలో మహిళను ఇలా దించేయడం తగదని కండక్టర్‌ను హెచ్చరించారు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని బాధితురాలు మంగళవారం సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.