నిలిచిన ఆర్టీసీ బస్సులు
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:16 AM
ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థ కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రైవేట్ యాజమాన్యం పరిఽలోని అద్దె బస్సులు, ఎలక్ర్టిక్ బస్సులను నడిపించారు. అద్దె బస్సు నడిపే ఒక ప్రైవేట్ డ్రైవర్ లారీని ఢీకొట్టడంతో 22 మంది ప్రయాణికులకు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థ కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రైవేట్ యాజమాన్యం పరిఽలోని అద్దె బస్సులు, ఎలక్ర్టిక్ బస్సులను నడిపించారు. అద్దె బస్సు నడిపే ఒక ప్రైవేట్ డ్రైవర్ లారీని ఢీకొట్టడంతో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హుజూరాబాద్ బస్ డిపో నుంచి ప్రైవేట్ బస్సు బయటకు రాగానే ఆర్టీసీ కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమ్మెతో బస్సులు పూర్తిస్థాయిలో నడపక పోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో వారు అధిక చార్జీలు వసూలు చేశారు. మండే ఎండలకు తోడు బస్సులు లేక బస్టాండ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా ఉన్న కరీంనగర్-1, కరీంనగర్-2, సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, గోదావరిఖని, మంథని, హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. పురుషులకు కూడా ఉచిత ప్రయాణాన్ని అనుమతించారు. రీజియన్‌లో 10శాతం బస్సులు మాత్రమే నడిచాయి. 11 డిపోల్లో 450 బస్సులను నడిపించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా కరీంనగర్ రీజియన్‌లో తొలిరోజు సుమారు కోటి రూపాయలకుపైగా ఆదాయం కోల్పోయింది. గతంలో రోజుకు సగటున కోటి 90 లక్షల రూపాయల ఆదాయం సమకూరేది.
ఫ సమ్మెకు అన్ని సంఘాల మద్దతు
ఆర్టీసీలో ఉన్న సంఘాలన్ని సమ్మెకు మద్దతు ప్రకటించడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ఆర్టీసీలోని తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ యూనియన్, ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌టీయూతో పాటు ఆర్టీసీలోఉన్న కార్మిక సంఘాలన్ని సమ్మెలో పాల్గొంటున్నాయి.
ఫ డిపోల ఎదుట కార్మికుల నిరసన ప్రదర్శనలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా కార్మికులు అన్ని డిపోల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఉదయం వేళలో కార్మికులు కరీంనగర్-1 డిపో ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. డిపోల నుంచి బయలు దేరిన ఒకటి రెండు బస్సులను కార్మిక సంఘాల నాయకులు అడ్డుకుని సమ్మెకు సహకరించాలని కోరడంతో వారు విధుల నుంచి నిష్క్రమించారు. ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నీ సమ్మెకు సహకరించడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి.
ఫ అందరికీ ఉచిత ప్రయాణం
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్సుల్లో అందరికీ ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. సమ్మె కారణంగా బస్సుల్లో కండక్టర్లు లేక పోవడంతో టికెట్లు ఇచ్చే వారు లేక అందరికీ ఉచిత ప్రయాణం అందించారు. ఇంత వరకు ప్రభుత్వం కల్పించిన మహాలక్ష్మి పథకంతో మహిళలు మాత్రమే ఉచితంగా ప్రయాణించే వారు, సమ్మె కారణంగా బస్సుల్లో కండక్టర్లు లేక పోవడంతో పురుష ప్రయాణీకులకూ ఉచిత ప్రయాణం అందినట్లయింది.
ఫ ప్రైవేట్ కండక్టర్ల, డ్రైవర్ల నియామకం కోసం ప్రయత్నాలు :
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఒక రోజు డ్యూటీకి గాను డ్రైవర్లకు వెయ్యి రూపాయలు, కండక్టర్లకు 800 రూపాయలు ఇస్తామని సంస్థ ప్రకటించింది. హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉండి, కనీసం 18 నెలల అనుభవం ఉన్న వారు డ్రైవర్‌గా పనిచేసేందుకు ఒరిజనల్ ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాసుపోర్టుసైజు ఫొటోలు తీసుకొని వారు పనిచేయదలుచుకున్న డిపోలలో సంప్రదించాలని, కండక్టర్లు కూడా ఆయా డిపోల్లో సంప్రదించి నియామకం పొందవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్ డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని కార్మిక సంఘాలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.