Share News

పెద్దపల్లి : కదలని ఆర్టీసీ బస్సులు..

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:19 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖని, మంథని డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు

పెద్దపల్లి :  కదలని ఆర్టీసీ బస్సులు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖని, మంథని డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఇతర కార్మికులు ద్విచక్రవాహనాలపై విధులకు హాజరయ్యారు. సమ్మె జరుగుతున్న విషయం తెలియక వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులను ప్రైవేట్‌ వాహనాల యజమానులు దండుకున్నారు. సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీలకు రెండింతలు వసూలు చేశారు. సమ్మె నడుస్తుండడంతో దూరప్రయాణం చేయాల్సిన వాళ్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఉదయం 10గంటల తర్వాత పోలీసుల సహాయంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అద్దె బస్సులను కండక్టర్లు లేకుండానే నడిపించారు. ఎవరు ఎక్కినా కూడా టిక్కెట్లు తీసుకోలేదు. మహిళలు ఆధార్‌ కార్డులు బయటకు తీయకుండానే ప్రయాణం చేయగా, ఉచిత ప్రయాణంతో పురుషులు మాత్రం సంబరపడ్డారు. మహిళలకు ఉన్నట్లుగా మాకు కూడా ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఎంత బాగుండు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ డ్రైవర్‌, కండక్టర్లతో పాటు కాంట్రాక్టు కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. మంథని డిపోలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక మహిళా కండక్టర్‌ విధులకు హాజరయ్యారు. ఆమె విధులు నిర్వహించడంపై కొందరు కార్మికులు అభ్యంతరం తెలపడంతో మధ్యాహ్నం విధుల నుంచి నిష్క్రమించారు.

- రోడ్డెక్కిన అద్దె బస్సులు..

గోదావరిఖని డిపోలో 140ఆర్టీసీ బస్సులు ఉండగా, ఇందులో ఆర్టీసీకి చెందినవి 90బస్సులు, అద్దె బస్సులు 50ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు పోలీసుల సహాయంతో కొన్ని అద్దెబస్సులను రోడ్డెక్కించారు. గోదావరిఖని నుంచి కరీంనగర్‌, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల వరకు ప్రధాన రూట్లలో బస్సులను నడిపించారు. మంథని డిపోలో 90బస్సులు ఉండగా, ఆర్టీసీకి చెందినవి 55, అద్దె బస్సులు 35 ఉన్నాయి. వీటిలో కొన్ని అద్దెబస్సులను నడిపించారు. మంథని నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌కు నడిపించారు. కరీంనగర్‌ నుంచి ఎలక్ర్టికల్‌ బస్సులు పెద్దపల్లి మీదుగా గోదావరిఖని, మంథని రూట్లలో నడిపించారు. ఆయాడిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి బస్టాండ్‌ను డీసీపీని భూక్యారాంరెడ్డి సందర్శించి ప్రయాణికులు, అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులతో మాట్లాడారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆయా రూట్లలో నడుస్తున్న అద్దె బస్సుల్లో ప్రయాణికులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇతరత్రా ప్రైవేట్‌ వాహనాలు, క్యాబ్‌లు బస్టాండ్‌ లోపలికి రాకుండా చూడాలని సూచించారు. గ్రామీణప్రాంతాలకు బస్సులు నడవక పోవడంతో సదరు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆయా డిపోలకు మొదటిరోజు 20లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

- తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్లను నియమించాలని ఆదేశాలు..

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రధాన రూట్లలో షటిల్‌ సర్వీసులను నడిపించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. హెవీ లైసెన్స్‌ కలిగి ఉండి 18నెలల అనుభవం గల డ్రైవర్లను తాత్కాలికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. వీరికి రవాణా శాఖాధి కారులు ద్వారా డ్రైవింగ్‌ టెస్ట్‌ చేయించి వాళ్లు ఓకే అన్న తర్వాతనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారికి తాత్కాలికంగా కండక్టర్లుగా తీసుకోవాలని, వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తీసుకుని టిమ్‌ల గురించి అవగాహన కల్పించాలన్నారు. కండక్టర్‌కు 800, రడ్రైవర్‌కు వెయ్యి రూపా యలు ఇవ్వడంతో పాటు భోజన సదుపాయం కల్పించాలని, 12గంటలకు మించకుండా విధులు నిర్వహించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 01:19 AM