Share News

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై అధికారుల చర్య

ABN , Publish Date - May 27 , 2026 | 05:03 AM

వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలని వ్యాఖ్యలు చేసిన జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ అశోక్‌పై మంగళవారం అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై అధికారుల చర్య

  • విధుల్లోకి తీసుకోవద్దంటూ యజమానికి డీఎం నోటీసు

  • వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటూ డ్రైవర్‌ వ్యాఖ్యలు

  • ఆశోక్‌ను విధుల నుంచి తొలగించొద్దని చెప్పాం: మంత్రి పొన్నం

జగిత్యాల/హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలని వ్యాఖ్యలు చేసిన జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ అశోక్‌పై మంగళవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదే రూట్‌లో జగిత్యాల డిపోకు చెందిన అర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ అశోక్‌.. బస్సు నడుపుతూ ‘ముందు రైతుల వడ్లు, మక్కల గురించి పట్టించుకోండి.. తర్వాత పెట్రోల్‌, డీజీల్‌ ధరల పెరుగుదలపై మాట్లాడవచ్చు’ అంటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతో.. అద్దె బస్సు యజమాని వేణుగోపాల్‌కు నోటీసు జారీ చేస్తూ.. డ్రైవర్‌ అశోక్‌ను విధుల నుంచి తొలగించాలంటూ జగిత్యాల ఆర్టీసీ డీఎం కల్పన ఆదేశించారు. కాగా, అశోక్‌ ఆర్టీసీ ఉద్యోగి కాదని, అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. అతన్ని విధుల నుంచి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించామని చెప్పారు.

డ్రైవర్‌ అశోక్‌కు అండగా విపక్షాలు..

డ్రైవర్‌ అశోక్‌ ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. సస్పెన్షన్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అశోక్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి అధికారులకు వినతిపత్రం అందించారు. వడ్లు కొనుగోలుకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన డ్రైవర్‌ను ఆర్టీసీ నుంచి సస్పెండ్‌ చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. డ్రైవర్‌ను సస్పెండ్‌ చేయడాన్ని ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. అశోక్‌ను విధుల్లోకి తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకురాలు కవిత డిమాండ్‌ చేశారు.

Updated Date - May 27 , 2026 | 05:03 AM