Share News

ఐక్యంగా ఉంటే బాహ్య శక్తులు ఏమీ చేయలేవు

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:54 AM

కులాలకు అతీతంగా హిందూ సమాజం ఏకం కావాలని, సామాజిక సమరసత ద్వారానే దేశాన్ని బలోపేతం చేయగలమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చెప్పారు.

ఐక్యంగా ఉంటే బాహ్య శక్తులు ఏమీ చేయలేవు

  • కులాలకు అతీతంగా హిందూ సమాజం ఏకం కావాలి

  • ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సం‌ఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ పిలుపు

  • నిజామాబాద్‌ జిల్లా కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కులాలకు అతీతంగా హిందూ సమాజం ఏకం కావాలని, సామాజిక సమరసత ద్వారానే దేశాన్ని బలోపేతం చేయగలమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చెప్పారు. కులాల పేరుతో విడిపోవడం బలహీనతని, అందరం ఒక్కటే అనే భావనతో ఐక్యంగా ఉంటే బాహ్య శక్తులు ఏమీ చేయలేవన్నారు. హిందువుల్లో చైతన్యం కోసమే వందేళ్ల క్రితం డాక్టర్‌ కేశవరావ్‌ బలీరామ్‌ హెడ్గేవార్‌ ఆర్‌ఎ్‌సఎ్‌సను ప్రారంభించారని చెప్పారు. ఆర్‌ఎ్‌సఎస్‌ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభనుద్దేశించి భాగవత్‌ ప్రసంగించారు. హెడ్గేవార్‌ జననం, మరణం నాగ్‌పూర్‌లోనే జరిగిందని, అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని, అందుకే కందకుర్తిలో స్ఫూర్తి కేంద్రం నిర్మించామన్నారు. గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్‌ భగవత్‌ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తీసుకురాలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చారని తెలిపారు. హెడ్గేవార్‌ కూడా తల్లి భారతిని దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్‌ఎ్‌సఎ్‌సను ఏర్పాటు చేశారని భాగవత్‌ చెప్పారు. బ్రిటిష్‌ వారి కంటే ముందు ఎంతో మంది విదేశీయులు భారత్‌ను పాలించారని, హిందువులు ఐక్యంగా లేకపోవడం వల్లేఇది జరిగిందన్నారు. భవిష్యత్‌లో కూడా హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని హెడ్గేవార్‌ భావించారని భాగవత్‌ చెప్పారు. అందుకే హిందువుల్లో చైతన్యం కోసం, హిందూ సమాజాన్ని ఆదర్శంగా మార్చేందుకు ఆయన ఆర్‌ఎ్‌సఎ్‌సను ప్రారంభించారని గుర్తు చేశారు. హెడ్గేవార్‌ చూపిన మార్గంలో నేడు ఎంతోమంది నడుస్తున్నారని భాగవత్‌ చెప్పారు. కందకుర్తికి చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని, గోదావరి, మంజీర, హరిద్ర నదుల త్రివేణి సంగమ క్షేత్రమైన కందకుర్తికి రాముడు వనవాసంలో వచ్చారని భాగవత్‌ గుర్తు చేశారు.


కందకుర్తి నుంచే సేవాభావం, దేశభక్తి..

హెడ్గేవార్‌కు కందకుర్తి నుంచి సేవాభావం, దేశభక్తి అలవడ్డాయని భాగవత్‌ చెప్పారు. కందకుర్తిలోని మట్టిలో కూడా హెడ్గేవార్‌ స్ఫూర్తి ఉందన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో స్ఫూర్తి మందిరం ఏర్పాటు చేసుకున్నామని, ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని భాగవత్‌ పిలుపునిచ్చారు. కందకుర్తిలో కేశవ సేవా సమితి ద్వారా శిశుమందిర్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుతో ఉపాధి వంటి సేవా కార్యక్రమాలు జరుగుతుండటం హర్షణీయమని భాగవత్‌ చెప్పారు. కేశవ స్ఫూర్తి మందిరం కేవలం ఒక కట్టడం కాదని, దేశ సేవకు అంకితమయ్యే ప్రతి స్వయం సేవకుడికి శక్తి కేంద్రమన్నారు. కార్యక్రమంలో సియంట్‌ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఎంపీ అరవింద్‌ ధర్మపురి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

10 కోట్లతో స్ఫూర్తి మందిరం

కందకుర్తిలో రూ.10 కోట్లతో 3ఎకరాల విస్తీర్ణంలో ఈ స్ఫూర్తి మందిరాన్ని నిర్మించారు. ఇందులో హెడ్గేవార్‌ నిలువెత్తు విగ్రహంతో పాటు భారత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హెడ్గేవార్‌ వాడిన వస్తువులను, చేతిరాత లేఖలను, అరుదైన పుస్తకాలతో ఓ మ్యూజియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 12 , 2026 | 03:54 AM