నోటీసులిచ్చినా తగ్గేదే లేదు: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:30 AM
ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిపక్ష నేతలను నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
కుంభకోణాలను బయటపెడుతున్నందుకే వేధింపులని వ్యాఖ్య
హైదరాబాద్/హనుమకొండ/శాయంపేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిపక్ష నేతలను నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మొన్న హరీశ్‌రావుకు, నిన్న కేటీఆర్‌కు, నేడు తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దావో్‌సలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే హైదరాబాద్ సీపీ సజ్జనార్ తనకు నోటీసులు పంపారని ఆరోపించారు. నోటీసులకు భయపడి వెనక్కి తగ్గేదే లేదని స్పష్టంచేశారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు సీఎం రేవంత్ చేతిలో పావులుగా మారారని ఆరోపించారు. బ్రిటీష్ కాలం నుంచే ఫోన్ ట్యాపింగ్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ కు చెందిన ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా 9 వేల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఢిల్లీలో ట్యాపింగ్ నేరం కాదని చెప్పారని పేర్కొన్నారు. 2015 జూన్ 9న ఓటుకు నోటు కేసులో ఆనాటి ఇంటెలిజెన్స్ అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు పెట్టారని, నాటి అధికారుల్లో సజ్జనార్ కూడా ఉన్నారని వెల్లడించారు. అదే విషయం తాను చెప్తే తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.