వరదకాలువ అభివృద్ధికి రూ. 252 కోట్లు
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:10 AM
వరద కాలువను ప్రభుత్వం పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నది. కాలువల లైనింగ్, పటిష్టత, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు, హుస్నాబాద్ నియోజకవర్గాల
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వరద కాలువను ప్రభుత్వం పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నది. కాలువల లైనింగ్, పటిష్టత, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల ఆయకట్టుకు ఈ నిర్ణయం ద్వారా మేలు చేకూరనున్నది. వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు 211.17 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేట్‌ను ఆమోదించింది. కాలువలు పటిష్టం చేసేందుకు లైనింగ్ కోసం 40.77 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించి ఆమేరకు నిధులు మంజూరు చేసింది. జీవోఆర్‌టి నెంబరు 518 తేదీ 19 అక్టోబరు 2026 ద్వారా పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఫ తొమ్మిది స్ట్రక్చర్ల నిర్మాణం
వరద కాలువ ఆయకట్టు పరిధిలో పట్టణీకరణ పెరగడంతోపాటు గ్రానైట్ క్వారీలు ఏర్పాటు కావడంతో ఆయకట్టు ఏరియా నుంచి 9,125 ఎకరాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. గతంలో కాలువల అభివృద్ధి పనుల కోసం చేసిన ఎస్టిమేట్ నుంచి ఈ ఆయకట్టు మినహాయింపును పరిగణలోకి తీసుకొని అగ్రిమెంట్ విలువలో 8.83 కోట్లను తగ్గించి 211.17 కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపింది. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు అదనపు స్ట్రక్చర్ల నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు చేపట్టేందుకు 40.77 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించి పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చింది. ఈ నిధులతో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండల పరిధిలో నాగులమల్యాల, బద్దిపల్లి, బాహుపేట, కమాన్‌పూర్, చొప్పదండి నియోజకవర్గంలోని ఒడ్యారం, వెలిచాల, బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన 5,384 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరేలా తొమ్మిది స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఫ నర్సింగాపూర్ ఊర చెరువు అభివృద్ధి
నర్సింగాపూర్ ఊరచెరువు అభివృద్ధి పనులు కూడా ఈ నిధులతో చేపట్టనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కుడి ప్రధాన కాలువ పరిధిలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ మండలాల్లో వరద కాలువపై 38 బ్రిడ్జీల నిర్మాణం చేపట్టనున్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, ముదిమాణిక్యం, రామంచ, సీతారాంపూర్, రేకొండ, బొమ్మనపల్లి, పీచుపల్లి, ముల్కనూర్ గ్రామాల్లో 5,620 ఎకరాల ఆయకట్టుకు, సైదాపూర్ మండలంలోని 14 గ్రామాల పరిధిలో 18,778 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనున్నది. 38 బ్రిడ్జీలు నిర్మాణం కానున్నాయి. ఎడమ, కుడి ప్రధాన కాలువలకు 40.77 కోట్లతో సీసీ లైనింగ్ పనులు చేపట్టడంతోపాటు అదనపు స్ట్రక్చర్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో కాలువ పటిష్టత పెరిగి చివరి భూముల వరకు సాగునీరు అందే అవకాశం కలుగనున్నది.
ఫ నీటిపారుదల మంత్రికి జిల్లా మంత్రి పొన్నం కృతజ్ఞతలు
రైతాంగ సంక్షేమానికి సాగునీటి రంగ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి వరద కాలువ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంతోపాటు జిల్లాలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషిచేస్తానని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 252 కోట్లను వెచ్చించేందుకు పరిపాలనా అనుమతులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.