రూ.1,200 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వైసీపీ నేత విజయప్రసాద్ ఇళ్లలో సోదాలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:59 AM
వేలాది మంది డిపాజిట్‌దారుల్ని నట్టేట ముంచిన వెల్ఫేర్ గ్రూపు సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయా ల్లో ఐదుచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
వెల్ఫేర్ గ్రూపు కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు
భారీ స్థాయిలో మనీలాండరింగ్ అనుమానాలు
ఆరు రాష్ట్రాల్లో వెల్ఫేర్ గ్రూపుపై ఫిర్యాదులు
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వేలాది మంది డిపాజిట్‌దారుల్ని నట్టేట ముంచిన వెల్ఫేర్ గ్రూపు సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయా ల్లో ఐదుచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. విశాఖప ట్నం వెస్ట్ ప్రాంతానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయప్రసాద్, ఆయన కుటుంబసభ్యులు, వెల్ఫేర్ గ్రూపునకు చెందిన ఇతర డైరెక్టర్లు ముఖ్యుల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున డిజిటల్ ఆధారాలు, ఎలకా్ట్రనిక్ ఎవిడెన్స్‌లు మనీలాండరింగ్ కేసులో స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.1,200కోట్ల రూపాయల మేరకు వెల్ఫేర్ గ్రూపు ఏపీ, తెలంగాణ, ఒడిసా, జార్కండ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని డిపాజిట్‌దారుల నుంచి చిట్టీల రూపంలో డబ్బులు సేకరించి తర్వాత చెల్లింపులు చేయక చేతులెత్తేసింది. ఈ విషయమై గతంలో ఫిర్యాదులు రావడంతో పలు రాష్ట్రాల్లో విజయ ప్రసాద్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. 2016 ప్రాంతంలో సీబీఐ సైతం వెల్ఫేర్ గ్రూపుపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత 2021లో విజయప్రసాద్‌ను చిట్‌ఫండ్ స్కామ్‌లో ఒడిసా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
చిట్‌ఫండ్ స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బును విజయప్రసాద్ ఎటువైపు మళ్లించారనే అంశాలను మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు వెల్ఫేర్ గ్రూపు ఏడు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించింది. నెలవారీ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్, ప్లాట్లు, అధిక వడ్డీ, డబుల్‌మనీ పథకాల పేరుతో వేలాదిమంది నుంచి డబ్బు సేకరించింది. మెచ్యూరిటీ గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో ఈ సంస్థపై కేసులు నమోదయ్యాయి. షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని, భారీగా స్థిరాస్తులను కొనుగోలు చేశారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. విజయప్రసాద్, ఆయన భార్య అరుణకుమారి, కుమార్తెలు అనూష, అలేఖ్యలు వెల్ఫేర్ గ్రూపులో డైరెక్టర్లుగా ఉండటంతో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, 2009 నుంచి జరిగిన లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది.