ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణానికి కన్సల్టెన్సీ
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:04 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం అంశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గం నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఎన్‌హెచ్‌ఏఐ ఓ కన్సల్టెన్సీని నియమించింది.
మంత్రి కోమటిరెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ
రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి కానుకన్న మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, మార్చి26 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం అంశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గం నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఎన్‌హెచ్‌ఏఐ ఓ కన్సల్టెన్సీని నియమించింది. డీపీఆర్ ప్రకియ్ర కొనసాగుతోందని, డీపీఆర్ వచ్చాకా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డికి ఓ లేఖ రాశారు. కేంద్ర మంత్రి మార్చి 3న రాసిన ఆ లేఖ.. సచివాలయంలోని ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయానికి గురువారం అందిందని.. ఆ కార్యాలయం తెలిపింది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని కోరుతూ 2025 ఆగస్టు5న మంత్రి కోమటిరెడ్డి తమకు ఇచ్చిన లేఖను కూడా పరిగణనలోకి తీసుకున్నామని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం చేసిన ఈ ప్రకటనతో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం ప్రాజెక్టు కేంద్రమే చేపట్టనుందని స్పష్టమవుతోంది. కాగా, కేంద్రం లేఖకు స్పందించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పిందంటూ మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాను రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ప్రస్తుతం టెండరు దశలో ఉండడం, దక్షిణ భాగం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో పూర్తిస్థాయి రీజినల్ రింగ్ రోడ్డు సాకారమవుతుందని మంత్రి కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిర్మించబోయే ఆర్‌ఆర్‌ఆర్ రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కాబోతుందని హర్షం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ను ముంజూరు చేసినప్పుడు కేంద్రం ఖరారు చేసి అలైన్‌మెంట్ ప్రకారం దక్షిణ భాగం 189 కిలోమీటర్లు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత చేసిన మార్పుల వల్ల 11 కిలోమీటర్ల దూరం పెరిగి ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం 201 కిమీలకు చేరింది. అనంతరం కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గం డీపీఆర్ రూపొందించి 2026 ఫిబ్రవరి 25న కేంద్రానికి పంపింది. చౌటుప్పల్ దగ్గర ప్రారంభమయ్యే ఈ రోడ్డు భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా సంగారెడ్డి వరకు ఉండనుంది. ఈ భాగం నిర్మాణం కోసం దాదాపు 2010 హెక్టార్ల భూమి అవసరంపడుతోందని డీపీఆర్‌లో పేర్కొంది. అయితే మళ్లీ ఇప్పుడు దక్షిణ భాగం డీపీఆర్ కోసం కన్సల్టెన్సీని నియమించామంటూ కేంద్రం చెప్పగా.. రాష్ట్రం పంపిన డీపీఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త డీపీఆర్ గతంలో మంజూరు చేసిన 189 కిమీల మేర ఉంటుందా? లేక రాష్ట్రం ప్రతిపాదించిన 201 కిమీల మార్గానికి ఉంటుందా?అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.