Share News

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.526.87కోట్లు

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:05 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి సేకరించిన భూములకు చెల్లించే పరిహారంలో.. రాష్ట్ర వాటా కింద రూ.526.87 కోట్లను భారత జాతీయ రహదారుల...

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.526.87కోట్లు

  • నేడో, రేపో ఎన్‌హెచ్‌ఏఐకు జమ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి సేకరించిన భూములకు చెల్లించే పరిహారంలో.. రాష్ట్ర వాటా కింద రూ.526.87 కోట్లను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు తెలంగాణ సర్కారు చెల్లించనుంది. నేడో, రేపో ఈ నిధులు ఎన్‌హెచ్‌ఏఐకు జమ కానున్నాయి. మొత్తం పరిహారంలో రాష్ట్ర వాటా దాదాపు రూ.2,560 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు హడ్కో ద్వారా రూ.2వేల కోట్ల రుణం సేకరించాలని గతంలోనే రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర వాటా వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తూ, నిధులను జమ చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి అనుబంధంగా ఉన్న రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌డీసీ) ద్వారా హడ్కో నుంచి తొలి విడత రుణం తీసుకుంది. ఈ మేరకు రూ.526.87కోట్లు సోమవారమే ఆర్‌డీసీ ఖాతాలోకి జమయ్యాయి. దీని ప్రకారం గతంలో ఇచ్చిన రూ.100కోట్లు, ఇప్పుడివ్వబోయే రూ.526.87 కోట్లు కలిపి రాష్ట్ర వాటా కింద రూ.626.87కోట్లు చెల్లించినట్లవుతుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది

ఆర్‌ఆర్‌ఆర్‌పై మా ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. సీఎం రేవంత్‌, నేను ఈ రోడ్డుపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. భూ పరిహారం కింద ఎన్‌హెచ్‌ఏఐకు చెల్లించాల్సిన రాష్ట్ర వాటాను నేడో, రేపో జమ చేయబోతున్నాం. హడ్కో నుంచి రుణం అందింది. మిగిలిన నిధులను ఎప్పుడు అడిగితే అప్పుడు చెల్లించేలా ఏర్పాట్లు చేశాం. ఆర్‌ఆర్‌ఆర్‌ రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. సీఎం దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నేను కూడా ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చిస్తున్నా. త్వరలోనే ఉత్తరభాగం రోడ్డుకు సంబంధించి శుభవార్త వస్తుందని ఆశిస్తున్నా. మా ప్రభుత్వ విజ్ఞప్తులతోనే దక్షిణభాగం మార్గంపైనా డీపీఆర్‌ను రూపొందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కన్సల్టెంట్‌ను నియమించింది.

- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి

Updated Date - Apr 07 , 2026 | 05:05 AM