ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగానికి హడ్కో రుణంపై కదలిక
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:46 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులపై ప్రభుత్వం దృష్టిసారించింది.
ఆర్థిక శాఖ వద్ద ఫైలు
రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర వాటా కింద దాదాపు రూ.2,560 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఇందులో ఇప్పటికే రూ.100 కోట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు డిపాజిట్ చేశారు. మిగిలిన నిధులను అందించడంలో భాగంగానే రూ.2వేల కోట్ల రుణాన్ని హడ్కో నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్ భూ పరిహారంలో రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల కోసం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఆశించిన స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్ పనులు ముందుకుసాగకపోవడంతో రుణం తీసుకోలేదు. తాజాగా రుణ సేకరణకు చర్యలు చేపడుతోంది. ఆర్ అండ్ బీ శాఖకు అనుబంధంగా ఉన్న రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఆర్‌డీసీ) ద్వారా హడ్కో నుంచి రుణం తీసుకోనున్నారు. ఆర్‌డీసీకి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుందని విశ్వసనీయంగా తెలిసింది. సంబంధిత ఫైలు ప్రస్తుతం ఆర్థికశాఖ వద్ద ఉన్నట్టు తెలిసింది. 6 వరుసల ఉత్తరభాగం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రస్తుతం పబ్లిక్-ప్రైవేటు-పార్ట్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలిస్తోంది. అక్కడి నుంచి కేంద్ర క్యాబినెట్‌కు ప్రాజెక్టు వెళ్లి ఆమోదం పొందేలోగా సమాంతరంగా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయడంపై ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాయి. కేంద్రం అనుమతివ్వగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే రహదారి నిర్మాణం కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారంపై ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ఉత్తరభాగం కోసం మొత్తం 1918.50 హెక్టార్లు సేకరించగా.. ఇందులో 1597.62 హెక్టార్లకు అవార్డులను మంజూరు చేశారు. ఇప్పటివరకు వీటిలో 343.1 హెక్టార్ల భూమికి సంబంధించి రూ.278.68 కోట్లు చెల్లించినట్టు తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. మరో 1,684.95 హెక్టార్ల భూమికి రూ.1,253.74 కోట్ల పరిహారాన్ని చెల్లించే ప్రక్రియను సిద్ధం చేశామని, ఇందులో రాష్ట్ర వాటా నిధులు జమ చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ నెలాఖరుకు నిధులు అందే అవకాశం ఉందని సమాచారం. 161 కి.మీమేర ఉండే ఉత్తర భాగం రోడ్డు నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో నిర్మించనున్నారు.
దక్షిణ భాగంలో 2,010హెక్టార్ల భూసేకరణ
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం మార్గం నిర్మాణంలో ముందడుగు పడింది. ఈ మార్గం తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఫిబ్రవరి 25న కేంద్ర రోడ్డు, రవాణా-హైవేల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాదాపు 2,010 హెక్టార్ల భూమి అవసరమని నివేదికలో పేర్కొంది. చౌటుప్పల్ దగ్గర ప్రారంభమయ్యే ఈ రోడ్డు యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాల మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం 201 కి.మీ ఉండనుంది. రోడ్లు-భవనాల శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలోనూ దీనిపై చర్చ జరిగింది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన చర్యలను ప్రారంభించాలని సూచించినట్టు తెలిసింది. ఈ రోడ్డుకు అవసరమైన భూములను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. కాగా దక్షిణభాగం నిర్మాణంలో భూ పరిహారం కింద రూ.6,500 కోట్ల వరకు అవసరమవుతాయని, భూ పరిహారం, రోడ్డు నిర్మాణానికి కలిపి మొత్తం రూ.16వేల కోట్లకు పైగా నిధుల అవసరం ఉంటుందని అధికారుల ప్రాఽథమిక అంచనాల్లో తేలినట్టు సమాచారం.