రోశయ్య సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:22 AM
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కొనియాడారు.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు రోశయ్య: మంత్రులు పొన్నం, వివేక్
ఘనంగా రోశయ్య 93వ జయంతి
ప్రవచనకర్త గరికపాటికి సన్మానం
హైదరాబాద్, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కొనియాడారు. అసెంబ్లీలో ఆయన వాగ్ధాటి, వారి మాటల్లో స్పష్టత ఎంతో గొప్పగా ఉండేవన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర భారతిలో రోశయ్య 93వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. రోశయ్య పీసీసీ చీఫ్‌గా పనిచేసినప్పుడు కార్యకర్తల నుంచి నాయకుల వరకు పిలిపించుకుని దశా-దిశా నిర్దేశం చేసేవారని మహేశ్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. కుటుంబాలకు, వ్యక్తులకే కాకుండా రాష్ట్రాలకూ ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఎలా సుపరిపాలన అందించవచ్చో రోశయ్య చూపించారని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై రోశయ్య వేసే ప్రశ్నలు, ప్రభుత్వాన్ని నిలదీసే తీరు గొప్పగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. రోశయ్య ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు ఏనాడూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటలేదని, దాంతో నాడు సీఎంగా ఉన్న వైఎస్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకెళ్లి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితినే పెంచేలా ఒప్పించాల్సి పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచందర్‌రావు చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును సన్మానించారు. ఆర్థిక క్రమశిక్షణలో రోశయ్యకు ఎవరూ సాటిరారని గరికపాటి అన్నారు. నేడు ఈఎంఐ లేని యువత చాలా అరుదుగా కనబడతారని చెప్పారు. మద్యపానం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని రోశయ్య తనను కోరేవారని గుర్తుచేసుకున్నారు. నేటి ప్రభుత్వాలు మద్యపాన నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవడం ఆయనకిచ్చే నిజమైన నివాళి అవుతుందని సూచించారు.