నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:51 AM
నేర పరిశోధనలో క్రమశిక్షణ గల భాగస్వాములుగా జాగిలాల పాత్ర కీలకమని ఇంటెలిజెన్స్ అధిపతి విజయ్‌కుమార్ తెలిపారు.
జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్
హైదరాబాద్/ మొయినాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలో క్రమశిక్షణ గల భాగస్వాములుగా జాగిలాల పాత్ర కీలకమని ఇంటెలిజెన్స్ అధిపతి విజయ్‌కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఐఐటీఏ)లో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 25వ బ్యాచ్ పోలీసు జాగిలాలు, వాటి హ్యాండర్ల పాసింగ్ ఔట్ పరేడ్ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. నేరస్తులను గుర్తించి పట్టుకోవడం, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడంతోపాటు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లలో ఎనలేని పాత్ర పోషించే జాగిలాలు, వాటి హ్యాండర్ల మధ్య అవగాహన ప్రకారం శిక్షణ మెరుగ్గా ఉంటుందన్నారు. నేర పరిశోధనకు సరికొత్త జవ జీవాలు నింపడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం జాగిలాలకు శిక్షణ ఇచ్చామన్నారు. జాగిలాల శిక్షణలో ఉత్తమ ప్రతిభ గల వారికి పతకాలు, మెమొంటోలు అందజేసి అభినందించారు. వివిధ అంశాల్లో శిక్షణ పొందిన జాగిలాల పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. పేలుడు పదార్థాల విభాగంలో సీఐఎ్‌సఎ్‌ఫకు చెందిన వి.భాస్కరరావు (లియో జాగిలం), నార్కోటిక్స్‌లో బీహార్ సీఐడీకి చెందిన సుదర్శన్ కుమార్ (చార్లీ), ట్రాకర్ విభాగంలో రామగుండం శ్రీనాథ్ (రాకీ జాగిలం) ప్రథమ బహుమతులు పొందాయి. నైపుణ్యం ఆధారంగా జాగిలాలలను మూడు ప్రత్యేక విభాగాలుగా గుర్తించి.. వేర్వేరుగా శిక్షణనిచ్చామని అకాడమీ ట్రైనింగ్ కన్సల్టెంట్ మాణిక్ రాజ్ తెలిపారు