Share News

రోహిత్‌రెడ్డి సస్పెండైనట్లా? కానట్లా?

ABN , Publish Date - May 27 , 2026 | 04:48 AM

తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

రోహిత్‌రెడ్డి సస్పెండైనట్లా? కానట్లా?

  • షోకాజ్‌ నోటీసులిచ్చి సస్పెండ్‌ చేశామన్న కేటీఆర్‌

  • ఆయన ప్రకటించిన 48 గంటల్లోనే పార్టీ కండువాతో రోహిత్‌

  • కేటీఆర్‌ మాటలకూ విలువ లేదని కాంగ్రెస్‌ నేతల ఎద్దేవా

తాండూరు మే 26 (ఆంధ్రజ్యోతి): తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఆయన అలా ప్రకటించిన 48 గంటల్లోనే గత సోమవారం రోహిత్‌రెడ్డి పార్టీ కండువాతో సభ్యత్వ నమోదు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొయినాబాద్‌లోని తన ఫాంహౌస్‌ లో డ్రగ్స్‌తీసుకొని పట్టుబడ్డాడని, తనిఖీకి వచ్చిన పోలీసులపై ఫైరింగ్‌కు ఉసిగొల్పాడన్న ఫిర్యాదులపై రోహిత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. కోర్టు రిమాండ్‌ విధించింది. ఆ క్రమంలో వివరణ ఇవ్వాలని పార్టీ ఆయనకు షోకాజ్‌ జారీ చేసింది. తర్వాత బెయిల్‌పై విడుదలైన రోహిత్‌రెడ్డి కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే, డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన రోహిత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేయలేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. వెంటనే స్పందించిన కేటీఆర్‌.. రోహిత్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసులిచ్చి, అప్పుడే సస్పెండ్‌ చేశామని మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత 48 గంటల్లోనే హైదరాబాద్‌లోని రోహిత్‌రెడ్డి ఇంటికి బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సభ్యత్వ ఇన్‌చార్జి విప్లవ్‌కుమార్‌ వెళ్లారు. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు రోహిత్‌పై బీఆర్‌ఎస్‌ చర్యలేమీ తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కేటీఆర్‌ మాటలకూ విలువ లేదని ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - May 27 , 2026 | 04:48 AM