Share News

వివాదాలకు కేరాఫ్‌‌గా రోహిత్‌రెడ్డి!

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:31 AM

ఒకనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ పోలీసు యంత్రాంగానికి వేగుగా మారారు. తన ఫాంహౌస్‌లో భారీ ఆపరేషన్‌ను తెరవెనుక నుంచి నడిపించి.. తానే ఫిర్యాదుదారుగా ఉన్నారు.

వివాదాలకు కేరాఫ్‌‌గా రోహిత్‌రెడ్డి!

  • నాడు ఫిర్యాదుదారు.. నేడు ప్రధాన నిందితుడు.. మెయినాబాద్‌ ఫాంహౌస్‌లో ‘పైలట్‌’ భిన్న పాత్రలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/తాండూరు)

ఒకనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ పోలీసు యంత్రాంగానికి వేగుగా మారారు. తన ఫాంహౌస్‌లో భారీ ఆపరేషన్‌ను తెరవెనుక నుంచి నడిపించి.. తానే ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఇప్పుడు అదే ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ కేసులో పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో నిందితుడిగా దొరికిపోయారు.. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి. దీంతో విధి వైచిత్రి అంటే ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022 అక్టోబరులో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ ముగ్గురు వ్యక్తులను మెయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో అరెస్ట్‌ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు వ్యక్తులు బీజేపీకి చెందిన వారుగా పేర్కొంటూ.. వారిపై కుట్ర కేసును అప్పటి ప్రభుత్వం నమోదు చేసింది. నాటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా రోహిత్‌రెడ్డి పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్‌ను వెనుక ఉండి నడిపారు. బేరసారాలు చేస్తున్నట్లు కథ అంతా నడిపి.. వీటిని కెమెరాల్లో రికార్డు చేయించారు. ఆయన ఫిర్యాదుతోనే ఈ వ్యవహారమంతా నడిచింది. ఇందులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. బీజేపీ సహకారంతోనే ఇది జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో అది రాజకీయ వివాదంగా మారింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఈ ఆపరేషన్‌ను తాను వెనుక ఉండి నడిపినట్లు అప్పట్లో రోహిత్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు.. ఈ సంఘటన తరువాత ఆయనకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘వై’ క్యాటగిరీతో భద్రత కల్పించింది. ఆ సిబ్బందితో రోహిత్‌రెడ్డి చాలా హడావిడి చేసేవారు. సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటూ భద్రతను దుర్వినియోగం చేశారు.


కండిషనల్‌ బెయిల్‌ ఉండగానే..

పైలట్‌ రోహిత్‌రెడ్డి చాలాకాలంగా వివాదాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా ఉంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే ‘రోహిత్‌రెడ్డి యంగ్‌ లీడర్స్‌’ పేరిట ప్రైవేట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహించేవారు. రిటైర్డ్‌ ఆర్మీమెన్‌ రక్షణార్థం ఆయుధాల లైసెన్స్‌ ఇవ్వగా.. రోహిత్‌రెడ్డి వారినే పర్సనల్‌ సెక్యూరిటీగా నియమించుకొని ఆయుధాలను దుర్వినియోగం చేశారని అప్పట్లో తాండూరులో కేసు నమోదైంది. ఆ తర్వాత తాండూరులో భారీ కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బందులు కలిగించారని న్యూసెన్స్‌ కేసు కూడా నమోదు చేశారు. తాండూరు రాఘవేంద్రనగర్‌ కాలనీలో అనుమతుల్లేకుండా షెడ్డు వేశారని పోలీసు బందోబస్తు మధ్య బల్దియా అధికారులు షెడ్డును కూల్చారు. అనంతరం ఎమ్మెల్యే అయిన తర్వాత రోహిత్‌రెడ్డిపై హైదరాబాద్‌లో ఇంటలిడెక్స్‌ కంపెనీ చెక్‌బౌన్స్‌ కేసు నమోదు చేసింది. ఇవే కాకుండా.. బెంగళూరులో ఓ సినీ నిర్మాత ఇచ్చిన డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలపై అక్కడి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇటీవల మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యేను ఎలా అనుమతించారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భంలో పోలీసులను నెట్టివేయడంతో రోహిత్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వెళ్లగా అజ్ఞాతంలో ఉండి హైకోర్టు నుంచి కండిషనల్‌ బెయిల్‌ తెచ్చుకున్నారు. ప్రతి సోమవారం తాండూరు పోలీ్‌సస్టేషన్‌లో హాజరు కావాలని చెప్పింది. దేశం విడిచి వెళ్లకుండా పాస్‌పోర్టును సీజ్‌ చేసింది. సోమవారం తాండూరు పోలీ్‌సస్టేషన్‌లో హాజరు కావాల్సి ఉండగా.. ఫాంహౌ్‌సలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడి పోలీస్‌ కస్టడీకి వెళ్లారు.

పుట్టా కు పలు వ్యాపారాలు

మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో డ్రగ్స్‌ పార్టీలో పోలీసులకు పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌.. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన టీటీడీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మహేశ్‌కుమార్‌ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను మహేశ్‌కుమార్‌ వివాహమాడారు. తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌తో కూడా ఆయనకు బంధుత్వం ఉంది. మహేశ్‌కుమార్‌కు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డిస్టిలరీ కంపెనీలతోపాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పీఎ్‌సకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు పీవీఎల్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌, నాంది కన్‌స్ట్రక్షన్‌ వంటి సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నితీష్‌ శర్మతో కూడా మహేశ్‌కుమార్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

Updated Date - Mar 16 , 2026 | 04:31 AM