Share News

రోహిత్‌రెడ్డికి ముగిసిన కస్టడీ

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:18 AM

రాష్ట్రంలో సంచలనం రేపిన మొయినాబాద్‌ ఫౌంహౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, నమిత్‌ శర్మ పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో పోలీసులు వారిని రాజేంద్రనగర్‌ కోర్డులో హాజరుపరిచారు.

రోహిత్‌రెడ్డికి ముగిసిన కస్టడీ

  • ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • మరో 3 రోజులపాటు కస్టడీ కోరిన సిట్‌

  • పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

  • చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు

  • ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం రేపిన మొయినాబాద్‌ ఫౌంహౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, నమిత్‌ శర్మ పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో పోలీసులు వారిని రాజేంద్రనగర్‌ కోర్డులో హాజరుపరిచారు. కాగా, నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, మరో మూడు రోజులపాటు వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు శనివారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే విడతల వారీగా ఆరు రోజులపాటు విచారించిన సిట్‌.. ఇంకా విచారించడానికి ఏముందని కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. మూడు రోజుల కస్టడీలో నిందితుల నుంచి సిట్‌ పలు కీలక విషయాలు రాబట్టింది. మార్చి 14న జరిగిన డ్రగ్స్‌ పార్టీలో రితీశ్‌రెడ్డి లైసెన్స్‌డ్‌ గన్‌ను నమిత్‌శర్మ ఎందుకు తీసుకున్నాడు? కాల్పులు ఎందుకు, ఎవరి ఆదేశాల మేరకు చేశాడు? అసలు నమిత్‌ శర్మ, రోహిత్‌రెడ్డికి మధ్య సంబంధమేంటి? వీరికి అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా సభ్యులతో సంబంధాలు ఉన్నాయా? మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలు, విదేశాల్లో వ్యాపారాలు, గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్‌ పార్టీలు ఎక్కడ జరిగాయి? ఆ పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారు? ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి? వంటి కీలక విషయాలను రాబట్టింది. ముఖ్యంగా రోహిత్‌రెడ్డి, ఆర్థిక పరమైన అంశాలు, విదేశీ టూర్లపై కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది.

Updated Date - Apr 05 , 2026 | 06:19 AM