రోహిత్‌రెడ్డికి బెయిల్
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:11 AM
ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్/మొయినాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. గత నెల 15న డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డితో పాటు అతని సోదరుడు రితే్‌షరెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా రాజేంద్రనగర్ కోర్టు తిరస్కరించింది. దీంతో రోహిత్‌రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. గతంలో ఓ సారి తిరస్కరణకు గురైంది. తాజాగా మంగళవారం మరో సారి ఆ పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పలు షరతులతో పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అభియోగపత్రం దాఖలు చేసే దాకా లేదంటే 8వారాలపాటు ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి 5 గంటల మధ్య సంబంధిత ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుకావాలని, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలని, కింది కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని దాటి వెళ్లకూడదని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం, విచారణలో జోక్యం చేసుకోవడం వంటివి చేయరాదని షరతులు విధించింది. కాగా, ఈ కేసులో రోహిత్‌రెడ్డికి మాత్రమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రోహిత్‌రెడ్డి సోదరుడు రితే్‌షరెడ్డి బెయిల్ పిటిషన్‌పై బుధవారం రాజేంద్రనగర్ కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. నమిత్‌శర్మ బెయిల్ పిటిషన్‌పై శనివారం హైకోర్టులో వాదనలు వినిపించనున్నట్లు పోలీసులు తెలిపారు.