1 నుంచి రహదారి భద్రతా సెస్సు అమల్లోకి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:46 AM
వాహన కొనుగోలుదారుల నుంచి రహదారి భద్రతా సెస్సు (రోడ్డుసేఫ్టీ సెస్సు) వసూలు మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. మోటారు వాహనాల చట్ట సవరణ అమలుకు సంబంధించి రవాణాశాఖ ...
ప్రభుత్వానికి ఏటా రూ. 300 కోట్ల ఆదాయం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వాహన కొనుగోలుదారుల నుంచి రహదారి భద్రతా సెస్సు (రోడ్డుసేఫ్టీ సెస్సు) వసూలు మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. మోటారు వాహనాల చట్ట సవరణ అమలుకు సంబంధించి రవాణాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన విధానం అమలు.. కొత్తగా వాహనం కొనుగోలు చేసే వారికి ఆర్థిక భారంగా మారనుండగా, రహదారి భద్రతా సెస్సుతో ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 300 కోట్లు ఆదాయం సమకూరనుంది. ద్విచక్ర వాహనాలకు రూ. 2 వేలు, ఫోర్ వీలర్లకు రూ. 5 వేలు, ఇతర భారీ వాహనాలకు రూ. 10 వేలు రోడ్డుసేఫ్టీ సెస్సుగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే వాహనాలు, ఆటోల వంటి జీవనోపాధి వాహనాలకు రోడ్డుసేప్టీ సెస్సు నుంచి మినహాయింపు ఉంది. ప్రస్తుతం తేలికపాటి గూడ్స్ వాహనాల నుంచి వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును అధికారులు లైఫ్ ట్యాక్స్‌గా మార్చారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే పాత వాహనాలపైనా, వాటి వయసును బట్టి వాహన ధరలో 4 శాతం నుంచి 6.5 శాతం వరకు వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు వాహనాలకు వాటి ధరలో 6.5 శాతం పన్ను వసూలు చేయనున్నారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య వాహనానికి 5 శాతం, 6 సంవత్సరాల కన్న ఎక్కువ కాలమైన వాహనాలకు 4 శాతం పన్ను రేటుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహనకు మాత్రమే ఈ నిధులు ఉపయోగించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కేర్‌ను మెరుగుపర్చాలి. గత జనవరిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే.