Share News

ఉద్రిక్తతల నడుమ రహదారి విస్తరణ పనులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:01 AM

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కందిలో జాతీయ రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి.

ఉద్రిక్తతల నడుమ రహదారి విస్తరణ పనులు

  • 50 హిటాచీలు, క్రేన్లతో ఆక్రమణల తొలగింపు

  • కంది- కవలంపేట వరకు ఆక్రమణలపై అధికారుల ఉక్కుపాదం

  • ముందస్తు నోటీసులు లేవంటూ బాధితుల ఆందోళన

  • గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్‌

కంది, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కందిలో జాతీయ రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. హైదరాబాద్‌-ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా, సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు ఆరు వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆక్రమణల తొలగింపుపై నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు దృష్టి పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన అధికారులు, భారీ పోలీసు బందోబస్తు మధ్య కంది జమ్‌-జమ్‌ దాబా నుంచి కవలంపేట వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. దాదాపు 50 హిటాచీలు, క్రేన్లతో ఆక్రమణలు తొలగించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న దుకాణాలు, రేకుల షెడ్లు, చెట్లను తొలగిస్తుండగా, స్థానిక వ్యాపారులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే తమ దుకాణాలను ఎలా కూల్చివేస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు, కొన్నినెలల ముందే నోటీసులు ఇచ్చామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. బతుకుదెరువు కోల్పోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల వరకు ఈ కూల్చివేతలు జరిగాయి. కూల్చివేతల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది.

Updated Date - Jan 24 , 2026 | 05:01 AM