Rising Lung Cancer Cases: ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉప్పెన!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:34 AM
ఊపిరితిత్తుల (లంగ్స్) క్యాన్సర్ భయపెడుతోంది. హైదరాబాద్‌లోనైతే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగించేవారిపైనే ఈ క్యాన్సర్ పంజా విసురుతోందనుకుంటే పొరపాటే.....
హైదరాబాద్‌లో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్
పొగాకు ఉత్పత్తులు వాడకపోయినా మహిళలకూ..
ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, బయోమాస్ ఇంధన వినియోగమూ కారణాలు
‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ అధ్యయంనంలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఊపిరితిత్తుల (లంగ్స్) క్యాన్సర్ భయపెడుతోంది. హైదరాబాద్‌లోనైతే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగించేవారిపైనే ఈ క్యాన్సర్ పంజా విసురుతోందనుకుంటే పొరపాటే. పొగాకు ఉత్పత్తులను వినియోగించకపోయినా, తక్కువ మో తాదులో వినియోగించినా, స్మోకింగ్‌తో సంబంధం లేకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ దాడి చేస్తోంది. ప్రధానంగా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, బయోమాస్ ఇంధన వినియోగం, పారిశ్రామిక కాలుష్యం, ప్యాసివ్ స్మోకింగ్, ఆహార పదార్థాల్లో వాడుతున్న కలరింగ్ ఏజెంట్లు ఇలా పలు కారణాల వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ విజృంభిస్తోంది. ఇలాంటి క్యాన్సర్ ఎక్కువగా మహిళల్లోనే పొడసూపుతోంది. దక్షిణాదిలో బెంగళూరు తర్వాత ఎక్కువ కేసులు హైదరాబాద్ మహిళల్లోనే బయటపడ్డాయి. పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ క్యాన్సర్ ఎక్కువగా సోకుతోంది. ఈ రాష్ట్రాల్లోనూ మహిళలే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. స్మోకింగ్‌తో సంబంధం లేని మహిళల్లోనూ కనిపిస్తోంది. 2030 నాటికి మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉన్నట్లు తేలింది. ఊపరితిత్తుల క్యాన్సర్ మహిళల్లో ఏడాదికి 6.7ు, పురుషుల్లో 4.3ు మేర పెరుగుతున్నట్లు బయటపడింది. మహిళల్లో దేశంలోనే తిరువనంతపురం, పురుషుల్లో దిండిగల్‌లో ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై ఇటీవల ఓ అధ్యయన వివరాలను ప్రచురించింది. దేశంలోని ఆరు ప్రాంతాలవారీగా అధ్యయనం చేయగా... ఈశాన్య రాష్ట్రాల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ముఖ్యంగా మిజో రం రాజధాని ఐజ్వాల్ దేశంలోనే ఎక్కువ క్యాన్సర్ కేసుల పట్టణంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 35.9ు మంది పురుషులు, 33.7ుమంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరణాల రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ 68ు పురుషులు, 54ు మంది మహిళలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఇలాంటివారు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో 2030నాటికి ప్రతి లక్ష మందికి కేరళలో 33 మంది కంటే ఎక్కువగా, బెంగళూరు వంటి నగరాల్లో 8మంది కంటే ఎ క్కువ మహిళల్లో క్యాన్సర్ కనిపంచవచ్చని అంటున్నారు.
ధూమపానం చేయనివారిలోనూ లంగ్స్ క్యాన్సర్
సాధారణంగా పొలుసుల కణ క్యాన్సర్(స్క్వామస్ సెల్ కార్సినోమా) చర్మంపై కనిపిస్తుంటుంది. కానీ.. ఇప్పుడు వివిధ రకాల గ్రంథుల్లో సోకే క్యాన్సర్ (అడెనోకార్సినోమా) ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ గ్రంథి క్యాన్సర్ అన్నవాహిక, ఊపిరితిత్తులు, పెద్దపేగు, రొమ్ము వంటి అవయవాల్లో శ్లేష్మం (మ్యూకస్) ఉత్పత్తి చేసే కణాలను ప్రభావితం చే స్తుంది. కడుపు, క్లోమం(ప్యాంక్రీజ్), ప్రొస్టేట్, లాలాజల గ్రంథులపైనా ప్రభావం చూపుతోంది. దక్షిణాదిలోని బెంగళూరులో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల్లో సగం మంది మహిళలే ఉండటం గమనార్హం. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద కణతుల క్యాన్సర్ రోగులసంఖ్య పెరుగుతోంది. పొగాకు ఉత్పత్తులు, మద్యపాన వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ.. దక్షిణాదిలోని కన్నూర్, కాసర్‌గాడ్, కొల్లాం జిల్లాల పురుషుల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తర భారత్‌లోని శ్రీనగర్‌లో ఎక్కువ మంది పురుషులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ప్రధాన కారణాలు..
క్యాన్సర్ ప్రబలడానికి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే కారణమని అంటున్నారు. .
క్యాన్సర్ కారణంగా చోటు చేసుకుంటున్న చాలా మరణాల కేసులు బయట పడటం లేదు. క్యాన్సర్ కారక మృతుల కేసులు చాలా తక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి.
కేవలం ధూమపానం వల్లే క్యాన్సర్ సోకుతోందన్న పరిస్థితి ఇప్పుడు లేదు. చాలా రకాల కారణాల వల్ల క్యాన్సర్ సోకుతోంది.
పారిశ్రామిక కాలుష్యంతో డేంజర్
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం వాయు కాలుష్యమే. ఇప్పుడు రకరకాలుగా గాలి కాలుష్యమవుతోంది. పరిశ్రమలు ఫ్యాక్టరీల నుంచి వెలువడే అర్సెనిక్ చాలా ప్రమాదకరం. ఆహార పదార్థాల్లో కలరింగ్ ఏజెంట్లు, ధూప్ స్టిక్‌లు, అగరువత్తుల పొగ క్యాన్సర్ కారకాలవుతున్నాయి. నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి. అస్బెస్టాస్, అర్సెనిక్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున... ఇలాంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ప్రజల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. కలర్లు కలిపిన ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇళ్లలో అగరువత్తులు, ధూప్ స్టిక్‌లను వెలిగించినప్పుడు ఇంటి దర్వాజాలు, కిటికీలను తెరిచి ఉంచాలి. ఇళ్లలో పొద్దస్తమానం కిటికీలు, తలుపులు మూసేసి, ఏసీ వేసుకుని ఉండకుండా... అప్పుడప్పుడు విష వాయువులు బయటకు వెళ్లేలా కిటికీలు తెరిచి పెట్టాలి.
- డాక్టర్ నరేందర్, పల్మనాలజిస్టు, ఖమ్మం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్