బక్కచిక్కనున్న బంగారు పతకం!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:32 AM
అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులతోపాటు విద్యాసంస్థలకు కూడా భారంగా మారుతున్నాయి.
జేఎన్‌టీయూ స్నాతకోత్సవంపై బంగారం ధరల ఎఫెక్ట్
హైదరాబాద్ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులతోపాటు విద్యాసంస్థలకు కూడా భారంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) స్నాతకోత్సవంపై కూడా ఈ ప్రభావం పడింది. దీంతో ఫిబ్రవరి 7న 14వ స్నాతకోత్సవం రోజు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రదానం చేసే బంగారు పతకాల తయారీ విషయంలో వర్సిటీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మొత్తం 73 బంగారు పతకాలకు గాను ఏటా 42 పతకాలను జేఎన్‌టీయూ, 31 పతకాలను దాతలు (ఎండోమెంట్ మెడల్స్) అందజేస్తున్నారు. ఒక్కో బంగారు పతకం తయారీకి 22 గ్రాముల వెండి, మూడు గ్రాముల బంగారాన్ని వినియోగించేవారు. మొత్తంగా పతకాల తయారీకి గతేడాది రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పెరగటంతో తయారీ ఖర్చు కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలో పతకాల తయారీకి నిధులు సమకూర్చటంపై డైరెక్టర్లతో వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ శుక్రవారం సమాశమై చర్చించారు. చివరకు 24 గ్రాముల వెండితో పతకం తయారు చేసి, ఒక గ్రాము బంగారంతో కోటింగ్ వేయాలని నిర్ణయించారు.