Share News

Extramarital Affairs: మూడు ముళ్లు..రెండు ముక్కలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:54 AM

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ప్రియురాలితో కలిసి జీవించేందుకు భార్య....

Extramarital Affairs: మూడు ముళ్లు..రెండు ముక్కలు

  • వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి

  • విడిపోయే ప్రత్యామ్నాయం ఉన్నా..భాగస్వాముల ప్రాణాలు తీస్తున్న వైనం

  • శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునేయత్నాలు

  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు

  • హత్య కేసుల్లో 20 నుంచి 25ు ఇవే

  • 2021-25 మధ్య ఈ తరహా హత్యలు 2,725.. అనాథలైన 2500 మంది పిల్లలు

  • దాదాపు 60 శాతం వివాహేతర సంబంధాల వెనుక సోషల్‌మీడియా పాత్ర

  • హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం,గుంటూరుల్లో అత్యధికంగా కేసులు

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ప్రియురాలితో కలిసి జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త! ఇటీవలికాలంలో తరచుగా కనిపిస్తున్న వార్తలివి!! భర్త ఎల్లప్పుడూ తిడతాడనో.. భార్య సాధిస్తోందనో.. కారణాలేవైనాగానీ ఇతరుల పట్ల ఆకర్షితులవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి! నిండు సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి!! బంధుమిత్రుల ఆశీస్సులతో అల్లుకున్న పవిత్ర బంధం క్షణిక సుఖాల ప్రకంపనలతో కుప్పకూలుతోంది. వలచినవారి కోసం కట్టుకున్నవారే కాలయములుగా మారడం.. జీవిత భాగస్వామిని అత్యంత క్రూరంగా చంపి.. శవాన్ని ముక్కలు చేయడం, తగలబెట్టేయడం, రాళ్లు కట్టి జలసమాధి చేయడం ఆందోళన కలిగిస్తోంది. కడకంటా ఒకరికొకరు తోడుండాల్సిన దంపతులు.. తాత్కాలిక ఆకర్షణలకు లోనై ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం సామాజిక విలువల పతనానికి అద్దం పడుతోంది. వివాహేతర సంబంధాల కారణంగా ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి అత్యంత క్రూరమైన హత్యలు గత ఏడాది కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 705 నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలుగు గడ్డపై రోజుకో చోట నమోదవుతున్న ఈ తరహా దారుణహత్యలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఘోరాలు సమాజానికి ఒక హెచ్చరికను పంపిస్తున్నాయి. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే.. పెద్దలు కూర్చుని పరిష్కరించేవారు. దంపతులు కూడా పెద్దలు చెప్తే విని.. ఓర్పు, సహనంతో వ్యవహరించేవారు. కానీ, ఇటీవలికాలంలో ఓర్పు, సహనం తగ్గి ‘ఈగో’ మరింత పెరగడం.. భాగస్వామితో గొడవైనప్పుడు సోషల్‌ మీడియా ద్వారానో, ఇంటి చుట్టుపక్కలో పరిచయమైన పరాయి వ్యక్తుల సాన్నిహిత్యానికి ఆకర్షితులు కావడం పెరుగుతోంది. ఆ తాత్కాలిక వ్యామోహాలు చివరకు హత్యలకు సైతం దారితీస్తున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో (2021 నుంచి 2025 నడుమ) ఈ తరహాలో 2,725 హత్యలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన మొత్తం హత్య కేసుల్లో 20 నుంచి 25ు మేర ఈ తరహావే ఉంటున్నాయి.


ఆ బంధాలేవీ?

టీవీలు, ఓటీటీలు, సోషల్‌ మీడియా.. ఇవేవీ లేని కాలంలో భార్యాభర్తల మధ్యే కాదు, కుటుంబంలో అందరి మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు ఉండేవి! ఇంటి హాల్లోకి టీవీలు, వాటికి కేబుల్‌ కనెక్షన్లు వచ్చాక.. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం తగ్గింది. ఆ టీవీలతోపాటు ఫోన్లు సైతం బెడ్‌రూమ్‌లోకీ చొచ్చుకొచ్చాక.. జీవితాల్లోకి సోషల్‌ మీడియా భూతం ప్రవేశించాక.. ఎవరి లోకం వారిదే అన్నట్టుగా తయారైంది. భార్యాభర్తలు ఒకే మంచం మీద ఉన్నా.. ఇద్దరూ తమ ఫోన్లలో మునిగిపోతున్నారు. మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేకపోవడం వల్ల బయటి వ్యక్తుల ‘హాయ్‌’లు, ‘గుడ్‌ మార్నింగ్‌’లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వచ్చే లైక్‌లు, కామెంట్‌లు నిజమైన ప్రేమ అని భ్రమపడుతున్నారు. ఆ మాయలో పడి నూరేళ్ల బంధాన్ని కాలరాస్తున్నారు. 60 శాతం వివాహేతర సంబంధాలకు కారణం స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియానే అని తేలుతోంది!

సినిమాలు, వెబ్‌సిరీ్‌సలు చూసి..

సినిమాలు, వెబ్‌ సిరీ్‌సలలో విచ్చలవిడి లైంగిక సంబంధాలను ఒక గొప్ప జీవనశైలిగా చూపడం, నేరం చేసి ఎలా తప్పించుకోవాలో విశదీకరించడం బలహీన మనస్తత్వం గలవారిని ప్రభావితం చేస్తోంది. హత్యలను గ్లామరైజ్‌ చేయడం వల్ల.. తప్పు చేసినా దొరకకుండా ఉండొచ్చనే భ్రమలో చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారు. జీవిత భాగస్వామి నచ్చకపోతే.. వేరొకరితో బంధమే కావాలని బలంగా అనిపిస్తే.. విడాకులు తీసుకోవచ్చు. ఒకప్పుడు విడాకులు తీసుకున్నవారిని చిన్నచూపు చూసేవారుగానీ.. ఇటీవలికాలంలో అది అసలు పెద్ద విషయమే కాదన్నట్టుగా పరిస్థితి మారింది. అయినా, ఆ ప్రత్యామ్నాయాన్ని చాలా మంది ఎంచుకోవట్లేదు. వెబ్‌సిరీ్‌సల్లోనో, సినిమాల్లోనో, యూట్యూబ్‌లోనో చూసి హత్యలకు పాల్పడుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో హత్య చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే విషయం కూడా వారికి అర్థం కానంత మత్తులో కూరుకుపోవడమే ఈ హత్యలకు కారణం. గతంలో ఈ తరహా హత్యలు క్షణికావేశంలో జరిగేవి. కానీ, ఇప్పుడు రోజుల తరబడి ప్రణాళికలు రచించి.. సుపారీ సైతం ఇచ్చి కిరాయి హంతకులతో చంపిస్తున్న ఘటనలు 40ు పెరిగాయి! గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హత్యలే కాదు.. తమ వివాహేతర సంబంధం గురించి జీవితభాగస్వామికి/ఇతరులకు తెలిసిపోయిందన్న అనుమానంతో/అవమానంతో, భాగస్వామి చేతిలో మోసపోయామన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నవారూ ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ తరహా ఆత్మహత్యలు 18ు దాకా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.


ఆరుతున్న దీపాలు.. అనాథలుగా బాలలు

భార్యాభర్తల్లో ఎవరో ఒకరు వేసే తప్పటడుగు.. వారి పిల్లల పాలిట శాపంగా మారుతోంది. వివాహేతర సంబందాల వల్ల ఎక్కువగా నష్టపోతోంది అమాయకమైన పిల్లలే. గత ఐదేళ్లలో ఈ తరహా హత్యల వల్ల దాదాపు 2500 మందికి పిల్లలు అనాథలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ‘తల్లిని చంపి తండ్రి (లేదా) తండ్రిని చంపి తల్లి జైలుకు వెళ్తే.. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? ఏం పాపం చేశారని వారికి శిక్ష అనే ఆలోచనే మనసులను కలచివేస్తుంది. అమ్మానాన్నల్లో ఒకరు కాటికి.. మరొకరు జైలుకు వెళ్తే.. ఆ పిల్లల గోడు ఎవరికి వినబడుతుంది? తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఒకరిని ఒకరు చంపుకోవడం చూసిన ఆ పసి మనసులు ఎంతగాయపడతాయో కదా! రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు.. అనాథలుగా మారి నేరగాళ్ల నీడలో పెరిగితే? పెరిగి పెద్దయ్యాక నేరగాళ్లుగా మారితే.. ఆ తప్పెవరిది?

మనస్పర్థలు వస్తే మాట్లాడుకోవాలి

వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యల ఉపద్రవం నుంచి బయటపడాలంటే.. మన ఆలోచన తీరు మారాలి. భాగస్వామిపై అనుమానం కలిగితే నిఘా పెట్టడం మానేసి నేరుగా మాట్లాడాలి. మనస్పర్థలు వస్తే.. మూడో వ్యక్తితో కాకుండా భాగస్వామితో చర్చించాలి. సమస్య తీవ్రమైతే కౌన్సెలింగ్‌ను ఆశ్రయించాలి. ఫోన్లను పక్కన పెట్టి.. భాగస్వామితో, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. చిన్నతనం నుంచే కుటుంబ వ్యవస్థ పట్ల పిల్లల్లో గౌరవాన్ని పెంచాలి. భాగస్వామి తప్పు చేశారని తెలిసినప్పుడు (లేదా) వారికి బదులుగా వేరొకరు నచ్చినప్పుడు.. చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. హత్య చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడం పరిష్కారం కాదు. ఆవేశంలో చేసే హత్యలు జీవితాన్ని జైలు గోడల మధ్య బంధిస్తాయి.. పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తాయి.

- పి.జవహర్‌ లాల్‌ నెహ్రూ, సీనియర్‌ సైకాలజిస్ట్‌, బిహేవియర్‌ ఎనలిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - Jan 20 , 2026 | 02:54 AM