Share News

kumaram bheem asifabad- బియ్యం ధరలకు రెక్కలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 10:58 PM

హార ధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వరి సాగు అంతంతే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పడంతో మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజులుగా ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి

kumaram bheem asifabad- బియ్యం ధరలకు రెక్కలు
లోగో

- సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం

బెజ్జూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వరి సాగు అంతంతే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పడంతో మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజులుగా ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. దీంతో మధ్య తరగతి, పేదలు ఎలా బతకాలో అర్థం కాకా సతమతమవుతున్నారు. సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగించే హంస రకం బియ్యం ధర క్వింటాల్‌కు రూ.3000నుంచి రూ.4000లకు చేరింది. జైశ్రీరాం సన్న రకం బియ్యం రూ,7వేల నుంచి రూ.7500లకు, హెచ్‌ఎంటీ బియ్యం రూ.6500నుంచి రూ.7000లకు, సోనా మసూరి రూ.5200నుంచి రూ.5800లకు పెరిగాయి. జిల్లాలో సన్నరకం బియ్యం దిగుబడి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వ్యాపారులు ముందుగానే ధరలు పెంచినట్లు తెలుస్తోంది. రేషన్‌ దుకాణాల ద్వారా పొందిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సన్నబియ్యం వైపు ప్రజలు మొగ్గు చూపడం కూడా డిమాండ్‌ పెరగడానికి తెలుస్తోంది. కాగా బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా అదే రీతిలో పయనిస్తున్నాయి. నాణ్యమైన తెల్ల జొన్నలు క్వింటాల్‌కు రూ.7.500లకు, డయాబెటిక్‌ బాధితులు ఎక్కువగా వాడే పచ్చ జొన్నలు రూ.6వేల నుంచి రూ.8వేలకు పెరిగాయి. కందిపప్పు కిలోకు రూ.120, పెసరపప్పు రూ.110, మినపప్పు రూ.115, ఎర్ర పప్పు రూ.90కి చేరింది. గోదుమల ధర సైతం క్వింటాల్‌కు రూ.300పెరిగింది. ఈ ఏడాది ఎల్‌నినోతో పంటలు పండని పక్షాన నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌ సరఫరాదారులు ధరలు పెంచడం వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Updated Date - Aug 05 , 2026 | 10:58 PM