Share News

బియ్యం ధరలకు కళ్లెం

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:24 AM

బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా బియ్యం ధరలను నియంత్రించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, పౌరసరఫరాల సంస్థ ప్రతినిధులు, బియ్యం విక్రయదారుల

బియ్యం ధరలకు కళ్లెం

పెద్దపల్లి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా బియ్యం ధరలను నియంత్రించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, పౌరసరఫరాల సంస్థ ప్రతినిధులు, బియ్యం విక్రయదారుల సంఘం నాయకులతో సమావేశమై ధరలను నిర్ణయించారు. నిర్ణయించిన ధరలకు మించి విక్రయాలు జరిపితే సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఫ కిలో రూ.79 లోపే..

జిల్లాలో ప్రస్తుతం జైశ్రీరామ్‌ బియ్యానికి వినియోగదారుల నుంచి అధిక డిమాండ్‌ ఉంది. ఈ రకం బియ్యం క్వింటాల్‌ ధర రూ.10 వేలు దాటడంతో మధ్య తరగతి, సామాన్యులకు భారంగా మారింది. బీపీటీ, కూనారం సన్న రకాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కిలో బీపీటీ, కేఎన్‌ఎం రకాల బియ్యం రూ.66 లోపే ఉండేలా చర్యలు చేపట్టింది. ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా బియ్యం కిలో 74 రూపాయలు, హెచ్‌ఎంటీ, జెఎస్‌ఆర్‌ రకం బియ్యం కిలో రూ.79గా వ్యాపారుల అసోసియేషన్‌ సూచన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్‌, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ధరల పట్టికను ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ధరల పట్టికను ప్రతి బియ్యం దుకాణం ఎదుట ప్రధర్శించాలని అధికారులు అదేశిస్తున్నారు.

ఫ అక్రమ నిల్వలపై ఆరా.

ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సాగు ప్రశ్నార్థం కాగా అందుబాటులో ఉన్న ఖరీఫ్‌ దాన్యమే ప్రజలకు పెద్ద దిక్కుగా మారింది. దీంతో భవిష్యత్తులో బియ్యం కొరత రావచ్చని, సన్నబియ్యానికి అధిక డిమాండ్‌ ఉంటుందని భావించిన కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుం టున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్టతోపాటు అక్రమంగా నిల్వ చేయకుండా అధికారులు నిఘా పెడుతున్నారు. బియ్యం దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. అధిక ధరలకు బియ్యం విక్రయించినా, నిల్వలు గుర్తించినా సమాచారం అందించాలని కోరుతున్నారు.

ఫ రేషన్‌ బియ్యంపై ప్రత్యేక నిఘా

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. కొన్నిచోట్ల రేషన్‌ బియ్యాన్ని సేకరించి మిల్లుల్లో ప్రాసెసింగ్‌ చేసి సన్నబియ్యంగా మార్చి తిరిగి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రేషన్‌ లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న కొందరు రైస్‌ డిపోల వారు వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రేషన్‌ బియ్యం పంపిణీ, లబ్ధిదారులపై దృష్టి సారిస్తున్నారు

ఫ రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు రవాణా

జిల్లా నుంచి రేషన్‌ బియ్యం పెద్దఎత్తున మహారాష్ట్రకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడి మిల్లుల్లో ప్రాసెసింగ్‌ అనంతరం తిరిగి జిల్లాలోని రైస్‌మిల్లులకు సరఫరా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ బియ్యాన్నే వారు తిరిగి ప్రభుత్వానికి సీఎంఆర్‌ కోటా కింద అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు ప్రాంతాలు, రవాణా మార్గాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఫ అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

- శ్రీనాథ్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యం విక్రయాలు జరపాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కలిగించేలా అధిక ధర వసూలు చేయడం, అక్రమంగా బియ్యం నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ధరల పట్టికను ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఎక్కడైనా నిర్ణీత ధరల కంటే ఎక్కువకు విక్రయించినా, అక్రమ నిల్వలు చేసినా ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి. ఫిర్యాదులపై పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం

ఫ రేషన్‌ బియ్యం పక్కదారి పడితే ఉపేక్షించం

- ముప్పిడి శ్రీకాంత్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నాం. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించడం, మిల్లుల్లో ప్రాసెసింగ్‌ చేసి తిరిగి మార్కెట్లో విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగా నిల్వ చేయాలి. అధిక ధరలు, అక్రమ బియ్యం నిల్వ, రేషన్‌ బియ్యం అక్రమ కొనుగోళ్లపై సమాచారం అందించి సహకరించాలి.

Updated Date - Nov 04 , 2026 | 01:24 AM