రైస్ మిల్లులు బంద్
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:01 AM
జిల్లాలోని రైస్ మిల్లుల్లో మిలింగ్ నిలిచిపోయింది. రైసుమిల్లర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రైస్ మ్లిల్లర్లు బంద్ పాటిస్తున్నారు. యాసంగిలో పండిన ధాన్యం బాయిల్డ్ బియ్యానికి మాత్రమే అనువుగా ఉంటాయి. బాయిల్డ్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలని మిల్లర్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలోని రైస్ మిల్లుల్లో మిలింగ్ నిలిచిపోయింది. రైసుమిల్లర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రైస్ మ్లిల్లర్లు బంద్ పాటిస్తున్నారు. యాసంగిలో పండిన ధాన్యం బాయిల్డ్ బియ్యానికి మాత్రమే అనువుగా ఉంటాయి. బాయిల్డ్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌సీఐ బాయిల్డ్ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ రా రైస్ మాత్రమే పెట్టాలని నిబంధన విధించింది. ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఫ బాయిల్డ్ రైస్‌ను అనుమతించని ఎఫ్‌సీఐ
జిల్లావ్యాప్తంగా 130 రైస్ మిల్లులు బంద్‌లో పాల్గొంటున్నాయి. యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన సందర్భంలో నూక ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. 40 శాతానికిపైగా ధాన్యం విరిగిపోయే అవకాశమున్నందున మిల్లర్లు బాయిల్డ్ బియ్యంగా ఈ ధాన్యాన్ని మార్చుతారు. జిల్లాలో ప్రస్తుతం యాసంగి సీజనకు సంబంధించిన ధాన్యం 2.5 లక్షల మెట్రిక్ టన్నులు, గత వానాకాలానికి సంబంధించిన లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి అక్టోబరు 31 వరకు ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాల్సి ఉన్నది. 40 రోజులుగా ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోవడానికి నిరాకరిస్తుండడంతో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తమ వద్ద పేరుకపోయాయని మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం చెల్లించడానికి తక్కువ సమయం ఉన్నందున ఎఫ్‌సీఐ ఇప్పటికే మిల్లింగ్ చేసిన బాయిల్డ్ బియ్యాన్ని తీసుకోవాలని, యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా తీసుకోవడానికి అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. బాయిల్డ్ రైస్‌ను అంగీకరించకపోతే ఆ ధాన్యాన్ని వేలం వేసి అమ్మితే తామే కొనుగోలు చేసి డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఎఫ్‌సీఐ అందుకు అనుమతించక పోవడంతో మిల్లులు బంద్ పెట్టాలని రైస్‌మిల్లర్ల సంఘం నిర్ణయించింది.
ఫ ఆందోళనలకు సిద్ధం..
కలెక్టరేట్ ఎదుట తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 11న రైసు మిల్లర్లు, మిల్లుల్లో పనిచేసే హమాలీ, తదితర కార్మికులు, ఇతర సిబ్బందితో కలిసి ధర్నా చేయాలని నిర్ణయించారు. ఎఫ్‌సీఐ తమ మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని వెంటనే తీసుకునేందుకు వీలుగా అదనపు స్టోరేజీని కేటాయించాలని, బాయిల్డ్ కోటాకు మించి మిగిలే దాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించే ధరకు మిల్లర్లు కొనుగోలు చేసి డబ్బు చెల్లించేలా నిర్ణయాన్ని ప్రకటించాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ధాన్యం మిల్లింగ్ పూర్తయ్యే వరకు ఫిజికల్ వెరిఫికేషన, షార్టేజీ ఆధారిత చర్యలను నిలిపివేయాలని, కేసులు నమోదు చేయవద్దని కోరుతున్నారు. ప్రభుత్వం అధికారులు, మిల్లర్లతోకలిసి సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.