రైస్‌మిల్లర్లు వర్సెస్ సర్కారు
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:59 AM
సీఎంఆర్ బియ్యం బకాయిల వ్యవహారం రైస్‌మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య అగ్గి రాజేస్తోంది. ప్రభుత్వానికి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అప్పగించలేకపోయిన మిల్లులపై ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. దీంతో జిల్లాలోని రైస్‌మిల్లర్లు ప్రత్యేకంగా
జగిత్యాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ బియ్యం బకాయిల వ్యవహారం రైస్‌మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య అగ్గి రాజేస్తోంది. ప్రభుత్వానికి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అప్పగించలేకపోయిన మిల్లులపై ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. దీంతో జిల్లాలోని రైస్‌మిల్లర్లు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల8వ తేదీ నుంచి మిల్లుల బంద్‌కు దిగారు. 10వ తేదీన సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేయడంతోపాటు.. 11వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం ’రైస్‌మిల్లర్లు వర్సెస్ ప్రభుత్వం‘ అన్నట్లుగా పరిస్థితి మారింది.
విజిలెన్స్ తనిఖీలతో కలకలం
సీఎంఆర్ బియ్యం బకాయిల వ్యవహారంపై ఇటీవల విజిలెన్స్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేపట్టడం మిల్లర్లలో మరింత ఆందోళనకు కారణమైంది. బియ్యం నిల్వలు, ధాన్యం, సీఎంఆర్ లెక్కలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనిఖీల తీరుపై మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలుమిల్లులపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదుచేశారు. సంబంధిత మిల్లుల్లో రూ.కోట్ల విలువగల ధాన్యం నిల్వలు లేవని గుర్తించారు. పోలీస్‌స్టేషన్లలో సైతం కేసులు నమోదయ్యాయి.
మిల్లులు మూత..
తనిఖీలు, బకాయిల వసూళ్ల నేపథ్యంలో రైస్‌మిల్లర్లు ప్రత్యేకసమావేశం నిర్వహించి తమ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, సీఎంఆర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించకుండా ఒత్తిడి చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిల్లుల బంద్ పాటిస్తున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు మిల్లర్లు కార్యాచరణ రూపొందించారు. దీంతో రాబోయే రోజుల్లో ఈవ్యవహారం మరింత ముదిరే అవకాశముంది.
మిల్లర్ల ప్రధాన డిమాండ్‌లివే..
రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్‌లను పెడుతోంది. ప్రధానంగా ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు సార్టెక్సింగ్ ప్రక్రియలో నష్టం, అధిక డ్యామేజ్, నూకలు, పరము, షార్టేజ్ సుమారు 15శాతం నుంచి 20శాతం వరకు అవుతోందంటున్నారు. కోత సమయంలో కురిసే అకాల వర్షాలవల్ల జరిగే నష్టం, తేమ తగ్గడం, బరువు తగ్గడం, సహజంగా ధాన్యం నాణ్యత క్షీణించడం వంటి నష్టాలను తప్పనిసరిగా నమోదు చేయాలంటున్నారు. వచ్చే తరుగును మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన సందర్భాల్లో లెక్కలోకి తీసుకోవాలంటున్నారు. మిల్లింగ్ చేస్తే ఇంకా అదనంగా షార్టేజ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) సకాలంలో సేకరించకపోవడం వల్ల నెలకొంటున్న ఇబ్బందులకు ప్రత్యామ్నాయం కల్పించాలి. బాయిల్డ్ మిల్లర్లను రా రైస్ అప్పగించాలని కోరుతున్నారని, దీంతో మిల్లింగ్ చేయలేమంటున్నారు. యాసంగి 2025-26 సీజన్‌లో మిగులుగా ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని, లేదంటే సంబంధిత ధాన్యం ముడిబియ్యంగా డెలివరీ చేయడం సాధ్యకానందున బాయిల్డ్ బియ్యంగా మార్చి డెలివరి చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం మిల్లింగ్ ద్వారా లభించే అవుట్-టర్న్ రేషియోను నిర్ధారించేందుకు సీఎఫ్‌టీఆర్‌ఐ నిర్వహించిన మిల్లింగ్ పరీక్షల నివేదికలను విడుదల చేసి, రాబోయే పంట సీజన్ నుంచి వాటి ఆధారంగా ఓటీఆర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎంఆర్ డెలివరీలు పూర్తయ్యే వరకు మిల్లులకు ధాన్యం కేటాయించవద్దని డిమాండ్ చేస్తున్నారు. మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ప్రధాన డిమాండ్ ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నారు.
ప్రభుత్వం ఏం చేస్తుందో?
ఒకవైపు సీఎంఆర్ బియ్యం సకాలంలో అందాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతుండగా.. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించకుండా మిల్లర్లపై చర్యలు తీసుకోవడం సరికాదని రైస్‌మిల్లర్లు వాదిస్తున్నారు. బకాయిల వసూళ్లు, విజిలెన్స్ తనిఖీలు, మిల్లుల బంద్ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు ప్రభుత్వం ఎలా తెరదించుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో సీఎంఆర్ పరిస్థితి ఏంటి..? రైస్‌మిల్లుల బంద్ కొనసాగితే సీఎంఆర్ బియ్యం సేకరణ, మిల్లింగ్, ప్రభుత్వానికి అప్పగింత ప్రక్రియపై ప్రభావంపడే అవకాశం ఉంది. ఇప్పటికే బకాయిల వ్యవహారంపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో బంద్ నిర్ణయం అధికారులకు కూడా సవాల్‌గా మారింది. దీంతో మిల్లర్లతో చర్చించి సమస్యను పరిష్కరిస్తారా? లేక నిబంధనల ప్రకారం చర్యలకు దిగుతారా? అన్నది వేచి చూడాల్సిందే.