Share News

ధాన్యం రిక‘వర్రీ’

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:28 AM

రైస్‌ మిల్లర్లు అక్రమంగా అమ్ముకున్న ధాన్యాన్ని రికవరీ చేయటంలో తాత్సారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 314 మంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు తేలగా..

ధాన్యం రిక‘వర్రీ’

  • 2022-23 యాసంగి టెండర్‌ ధాన్యం రికవరీలో తాత్సారం

  • 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు

  • 30 జిల్లాల్లో 314 మంది అక్రమార్కుల్ని గుర్తించిన విజిలెన్స్‌

  • కొన్ని జిల్లాల్లో.. కొందరు రైస్‌ మిల్లర్లపై కేసులు, అరెస్టులు

  • బకాయిలున్న మిగతా మిల్లర్ల సంగతేమిటంటూ విమర్శలు

హైదరాబాద్‌, నల్లగొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రైస్‌ మిల్లర్లు అక్రమంగా అమ్ముకున్న ధాన్యాన్ని రికవరీ చేయటంలో తాత్సారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 314 మంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు తేలగా.. ఇంతవరకూ వారి నుంచి ధాన్యం రికవరీ చేసే ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 5.40 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు ఇలా అమ్ముకున్నట్లు విజిలెన్స్‌ తేల్చింది. 25 శాతం జరిమానాతో వారి నుంచి ధాన్యం రికవరీ చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినప్పటికీ ఇంతవరకూ కొలిక్కిరాలేదు. ధాన్యం రికవరీలో భాగంగా కొన్ని జిల్లాల్లో కేసులు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో కావటంలేదు. ఈ క్రమంలో.. నల్లగొండ జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్‌ కందుకూరి మహేందర్‌, ఆయన భార్య పద్మను అరెస్టు చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగామారింది. అక్కడ రూ.42.8కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని కాజేసిన వ్యవహారంలో ఏడు మిల్లుల నిర్వాహకులపై అధికారులు కేసులు నమోదుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మిల్లర్లు 314 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో వ్యవహరించిన తీరులోనే మిగతా జిల్లాల్లోనూ ముందుకెళ్తారా? ధాన్యం అమ్ముకున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ నడుస్తోంది. అధికారుల దూకుడుతో.. తప్పుచేసిన మిల్లర్లలోనూ ఆందోళన మొదలైంది. పదివేల టన్నుల లోపు తగ్గుదల కనిపించిన మిల్లులపై కేసులు పెట్టకుండా.. ధాన్యం రికవరీ లేదా ధాన్యం విలువను ప్రభుత్వానికి చెల్లించడంతో సరిపెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.


జరిమానాతో కలిపి..

మిల్లర్లు అమ్మేసుకున్న 5.40 లక్షల టన్నుల ధాన్యం విలువ టెండరు రేటు ప్రకారం రూ. 1,080 కోట్లు అవుతుంది. 25 శాతం జరిమానా కలిపితే ఆ మొత్తం రూ.1,350 కోట్ల మేర ఉంటుంది. కానీ అన్ని జిల్లాల్లో సమాంతరంగా కేసుల నమోదు, రికవరీ, అరెస్టులు జరగట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేసుల నమోదుతో పాటు రికవరీ చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో రూ.340 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకోగా.. ఇప్పటి వరకు రూ.4 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే రికవరీ చేశారు. రెండు చోట్లా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌కు సంబంధించిన నాలుగు మిల్లుల్లో రూ.120 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో రికవరీ యాక్టును అమలుచేయలేదు. సంగారెడ్డి జిల్లాలో ఇంతవరకూ ఎలాంటి రికవరీ చేపట్టలేదు. సిద్దిపేట జిల్లాలో డిఫాల్టర్లైన రైస్‌ మిల్లర్లు తమ ఆస్తులను విక్రయించే వీలు లేకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కలెక్టర్‌ నోటీసులు జారీచేశారు. అయితే.. అన్ని జిల్లాల్లో కేసులు ఎందుకు పెట్టట్లేదు? కొన్నిచోట్లే ఎందుకు అరెస్టులు చేస్తున్నారనే ప్రశ్నలకు జవాబు లేదు.

Updated Date - Feb 27 , 2026 | 04:28 AM