Share News

టెండర్లు వేస్తే.. అంతుచూస్తాం

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:18 AM

మేం ఆరేడు నెలలుగా రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వచేసుకున్నాం.. ఇంతకాలం కాపాడిన ధాన్యాన్ని మీరు లోడెత్తుకొని పోతుంటే చూస్తూ ఊరుకోవాలా...

టెండర్లు వేస్తే.. అంతుచూస్తాం

  • సన్నధాన్యం బిడ్డర్లకు రైస్‌ మిల్లర్ల సంఘం నేతల బెదిరింపులు

  • సంఘం కార్యాలయాలకు పిలిచి మరీ హెచ్చరికలు

  • సన్నధాన్యానికి ఎక్కువ ధర రాకుండా అడ్డంకులు

  • పోటీ లేకుండా తక్కువ ధరకు కొట్టేసేందుకు కుయుక్తులు

  • నాలుగు లాట్లకు సింగిల్‌ బిడ్లు, మూడు లాట్లకు జీరో బిడ్డింగ్‌

  • ఆశించిన ధర రాకపోవడంతో టెండర్లు రద్దు చేసిన సర్కారు

  • కొన్ని రైస్‌మిల్లుల్లో కనిపించని గత ఖరీఫ్‌ సన్నధాన్యం!

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘మేం ఆరేడు నెలలుగా రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వచేసుకున్నాం.. ఇంతకాలం కాపాడిన ధాన్యాన్ని మీరు లోడెత్తుకొని పోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రభుత్వ ధాన్యం దక్కితే ఎంతోకొంత రేటుకు మాకే దక్కాలి. ఇప్పుడు మీరొచ్చి టెండరు వేస్తే అయిపోతుందా? ఒకవేళ టెండరు మీకొస్తే.. మేం ధాన్యం అప్పగిస్తామనుకుంటున్నారా? గతంలో ఓసారి 35 లక్షల టన్నుల వడ్లకు టెండర్లు పిలిస్తే.. ప్రభుత్వానికి, బిడ్డర్లకు చుక్కలు చూపించాం.. మీకు కూడా అదే గతి పడుతుంది. టెండరు వేసి ఈఎండీలు చెల్లించారు కాబట్టి.. ఓ రూ.50 లక్షలు గుడ్‌ విల్‌ ఇస్తాం తీసుకొని వెళ్లిపోండి. అంతేకానీ టెండర్లు అని మళ్లీ ఇటువైపు చూడకండి.. జాగ్రత్త’... ఇదీ సన్నధాన్యం టెండర్లలో పాల్గొంటున్న బిడ్డర్లకు రైస్‌మిల్లర్ల సంఘం నేతలు ఇస్తున్న ధమ్కీ. గ్లోబల్‌ టెండర్లలో వ్యాపారులు పాల్గొనకుండా, పోటీ పెరగకుండా, ప్రభుత్వానికి ఎక్కువ ధర రాకుండా రైస్‌మిల్లర్ల సంఘం నేతలు మోకాలడ్డుతున్నారు. బిడ్డర్లను రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయాలకు పిలిచి మరీ బెదిరిస్తున్నట్లు తెలిసింది.

5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వేలం..

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ 2025- 26 ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం 16 జిల్లాల్లోని 1,065 రైస్‌మిల్లుల్లో నిల్వ ఉంది. దీనిని గ్లోబల్‌ టెండర్ల ద్వారా ఈ- వేలం పద్ధతిలో బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వింటాలుకు రూ.3,405 రిజర్వు ధర (టన్నుకు రూ. 34,050) ఖరారుచేసింది. బిడ్డర్లు ఇంతకంటే తక్కువకు కోట్‌ చేయటానికి వీలులేదు. 5 లక్షల టన్నుల ధాన్యాన్ని 45 వేల టన్నుల చొప్పున 10 లాట్లు, 50 వేల టన్నులతో ఒక లాటు కలిపి.. మొత్తం 11 లాట్లుగా విభజించి టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎక్కువ ధర (హెచ్‌- 1) కోట్‌ చేసిన బిడ్డర్‌కు టెండరు దక్కుతుంది. పే అండ్‌ లిఫ్టింగ్‌ (డబ్బు చెల్లించి ధాన్యం తీసుకెళ్లే పద్ధతిలో) ఈ ప్రక్రియ పూర్తిచేసేలా నిబంధన పెట్టారు.


రైస్‌మిల్లర్ల సంఘం నేతల ధమ్కీలు

ప్రభుత్వ నిర్ణయం రైస్‌మిల్లర్లకు మింగుడు పడటంలేదు. ప్రభుత్వం ఎంతో కొంత ధర నిర్ణయించి ఆ ధాన్యాన్ని తమకే అప్పజెప్పాలని వారు భావిస్తున్నారు. అలా జరగకపోవటంతో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన బిడ్డర్లను రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయాలకు పిలిపించి ధమ్కీలిస్తున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఒక జిల్లాలో ఓ బిడ్డర్‌ను బెదిరించారు. ‘రైస్‌మిల్లర్లమంతా కలిసి సిండికేటుగా ఏర్పడి క్వింటాలుకు రూ.2 వేలకు మించకుండా బిడ్లు వేయాలని నిర్ణయించుకున్నాం. మీరు ఎక్కడినుంచో వచ్చి రూ.3 వేలకు బిడ్లు వేస్తామంటే ఇంతకాలం ధాన్యానికి కాపలా కాసిన మేం ఏమైపోవాలి? మీరు టెండరు ఖరారు చేసుకొని ఆర్వో (రిలీవ్‌ ఆర్డర్‌) పట్టుకొని రాగానే మేం ధాన్యం అప్పగిస్తామనుకుంటున్నారా? మర్యాదగా టెండర్లు రద్దుచేసుకొని వెళ్లిపోండి. మళ్లీ ధాన్యం టెండర్ల జోలికి రావొద్దు’ అని బెదిరించారు. అయితే, బిడ్డర్లు కూడా బలంగానే ఉండటంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని ఎదురు తిరిగారు. దీంతో ‘ఓ రూ.50 లక్షలు గుడ్‌విల్‌ ఇస్తాం.. తీసుకొని వెళ్లండి’ అని మిల్లర్ల సంఘం నేతలు బేరానికి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ, ఇరువర్గాల మధ్య బేరం కుదరలేదు.

4 లాట్లకు సింగిల్‌ బిడ్డింగ్‌.. 3 లాట్లకు జీరో బిడ్డింగ్‌

రైస్‌మిల్లర్లు సిండికేట్‌ కావటం, ట్రేడర్లను నియంత్రించటంతో ఈ- టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. 4 లాట్లకు సింగిల్‌ బిడ్లు దాఖలయ్యాయి. మరో 3 లాట్లకు ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. 3 లాట్లకు మాత్రం పోటీ ఏర్పడింది. వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పోటీ టెండరు బిడ్లు ధాఖలయ్యాయి. అయితే, టెండర్లకు ఆశించిన స్పందన రాకపోవటంతో వాటిని రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేడోరేపో రెండోసారి టెండరు నోటిఫికేషన్‌ జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

రైస్‌మిల్లుల్లో ధాన్యం మాయం?

సన్న ధాన్యం రైస్‌మిల్లుల్లో సగానికి సగం మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో పాల్గొనబోయే బిడ్డర్లు.. ధాన్యం నిల్వలను పరిశీలించటానికి మిల్లులకు గత వారం వెళ్లారు. సగానికి సగం మిల్లుల్లో ధాన్యం నిల్వలు కనిపించలేదని ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కనీసం 2లక్షల టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు ఇప్పటికే బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బయ టి నుంచి వేరే బిడ్డర్లను రానివ్వటంలేదని అంటున్నారు. ఇతర ఏజెన్సీలకు టెండర్లు దక్కితే ధాన్యం అప్పగించటం సాధ్యం కాదని, స్థానిక మిల్లర్లకే టెండర్లు దక్కితే.. ప్రభుత్వానికి ఒప్పంద ధర చెల్లించి, ధాన్యం లోడెత్తినట్లు కాగితాలపై చూపిస్తే సరిపోతుందనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్సు బృందాలతో రైస్‌ మిల్లుల్లో తనిఖీ నిర్వహిస్తే నిల్వల సంగతి తేలిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 06 , 2026 | 03:18 AM