రెవెన్యూవికేంద్రీకరణ!?
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:37 AM
రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి కలెక్టర్ల వద్ద ఉన్న అధికారాలను ప్రభుత్వం తగ్గించనుందా!? ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించనుందా!? అధికారాల వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా
ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు కీలక అధికారాలు
సీలింగ్, భూదాన్ భూములపైనా త్వరలో మార్గదర్శకాలు
పట్టాదారులకు అన్యాయం జరగకుండా..
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా దిశానిర్దేశం
22ఏ సహా రెవెన్యూ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు
ప్రజా ప్రతినిధులకు అవగాహన
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి కలెక్టర్ల వద్ద ఉన్న అధికారాలను ప్రభుత్వం తగ్గించనుందా!? ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించనుందా!? అధికారాల వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా!? ఈ మేరకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధమవుతోందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అధికార వర్గాలు. 22ఏపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు ముందు రోజు సెప్టెంబరు 16న కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఐదుగురు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా, 22ఏ వివాదంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, అధికారాల వికేంద్రీకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని తెలిసింది. ఈ సమావేశంలో ఎక్కువ మంది మంత్రులు కలెక్టర్ల వద్ద ఉన్న అధికారాలను తగ్గించాలని, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని ప్రతిపాదించినట్లు సమాచారం. సీలింగ్, భూదాన్ భూముల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే మార్గదర్శకాల ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిసింది. ఈ ఉత్తర్వులు వస్తే ఇప్పుడున్న 22ఏ వివాదాల్లో చాలా వరకు పరిష్కారమవుతాయని, సమస్య తీవ్రత కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
సీలింగ్, భూదాన్ వివాదాల్లో అసలు యజమాని ఎవరు? ఆ భూములపై చట్టబద్ధమైన హక్కు బోర్డుకు ఉందా? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందా? సీలింగ్ చట్టం కింద మిగు లు భూమిగా ప్రకటించిన తర్వాత ఏం జరిగింది? ఆ భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉందా? లేక ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉందా? పాత రికార్డులు, పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం చట్టబద్ధమైన హక్కుదారులను గుర్తించడం ఎలా!? అనే కోణంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 24న ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారనే కారణంతో ప్రభు త్వం ఆ ఇళ్లను తొలగించిన విషయం తెలిసిందే. దీని పై వివాదాలు నడుస్తున్నాయి. నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసి.. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సిఫార్సు చేసింది. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని గుట్టల బేగంపేట, గచ్చిబౌలి, నాదర్‌గూల్ పరిధిలో సీలింగ్ మిగులు భూముల వివాదాలు అధికంగా ఉన్నాయి. వీటన్నింటిపైనా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి ప్రైవేటు పట్టాదారులకు అన్యాయం జరగకుండా.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం.
22ఏ.. మాకూ అవగాహన కల్పించండి
22ఏపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని, అధికార పక్షం సరైన కౌంటర్ ఇవ్వడం లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో, అసలు 22ఏ అంటే ఏంటని కొందరు.. రెవెన్యూలో ఏం జరుగుతోందో తెలియడం లేదని మరికొందరు.. జిల్లాల్లో ఈ సమస్య మీద కలెక్టర్లు కూడా ఏ వివరాలూ చెప్పడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. దాంతో, 22ఏ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇక నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు వివరాలు అందించే ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఈ మేరకు గత వారం రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో పలు సమావేశాలు జరిగాయి. 22ఏను తొలిసారిగా 1999లో ప్రవేశపెట్టారని, ప్రస్తుత కొత్త రూపాన్ని 2007లో తీసుకొచ్చారని వివరించే పనిలో అధికారులున్నారు. 22ఏ వివాదంతో భవిష్యత్తులో సామాన్యులు ఇబ్బందులు పడకుండా 12 అంశాల ప్రాతిపదికన సమస్య ను పరిష్కరిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 118 జీవో కింద ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం కల్పించారు. సింగరేణి కోల్‌బెల్ట్‌లో జీవో 76 కింద క్రమబద్ధీకరణ చేసేందుకు మార్గం సుగమం చేశారు. అయితే, అధికారులు.. ప్రజల్లో తలెత్తిన ఆందోళనలను నివృత్తి చేసేందుకు గాను ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడంతో పాటు రెవెన్యూలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వివరించే పని పెట్టుకున్నారు.